

తన భర్త జితేంద్ర కుమార్ పెద్ద తాగుబోతు అని, తరచూ తాగి వచ్చి తనని కొట్టేవాడని, తన కూతురు కూడా తరచూ తనతో గొడవలు పెట్టుకునేదని, అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. తాను ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు డబ్బు, నగలు తీసుకు వెళ్ళలేదని, తన దగ్గర కేవలం ఓ మొబైల్ ఫోన్, రెండు వందల రూపాయలు మాత్రమే ఉన్నట్లు తెలిపింది. మరోవైపు తనను స్వప్న బెదిరించడంతోనే ఆమెతో పారిపోవడానికి ఒప్పుకున్నట్టు రాహుల్ కుమార్ చెప్పాడు. అలీఘర్ పోలీస్ స్టేషన్ లో కలవకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని స్వప్న తనకు ఫోన్ లో చెప్పిందని, దీంతో తాను అక్కడికి వెళ్ళానని, ఆ తర్వాత ఇద్దరూ కలిసి లక్నో వెళ్ళినట్లు తెలిపాడు. పోలీసులు తమ కోసం గాలిస్తున్నారని తెలియడంతో తామే వచ్చి లొంగిపోయినట్లు చెప్పాడు. అయితే ఇప్పుడు స్వప్నని పెళ్లి చేసుకుంటావా అని అడిగినప్పుడు తాను సిద్ధంగానే ఉన్నట్లు తెలిపాడు. అలీఘర్ లోని దావోస్ కి చెందిన స్వప్న, జితేంద్ర కుమార్ భార్యాభర్తలు. వీరికి శివాని అనే ఓ కూతురు ఉంది. ఆమెకు పెళ్లి చేయాలని భావించిన తల్లిదండ్రులు రాహుల్ కుమార్ అనే యువకుడితో శివానికి పెళ్లి నిశ్చయించారు. మరో పది రోజుల్లో పెళ్లి జరుగుతుంది అనగా ఏప్రిల్ 6, 2025 న 40 ఏళ్ల స్వప్న తనకు కాబోయే అల్లుడు రాహుల్ కుమార్ తో పరారీ అయింది. దీంతో ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.