
ఏడాదికొకసారి రాశి మారే గురువు మే 25న వృషభ రాశిని వదిలిపెట్టి మిథున రాశిలో సంచారం ప్రారంభించడం జరుగుతోంది. గురువు రాశి మారడమంటే కొన్ని రాశుల వారి జీవితాల్లో శుభ కార్యాల వెల్లువ ప్రారంభమైనట్టే భావించాలి. చాలా కాలంగా పెండింగ్ లో ఉండిపోయిన పెళ్లిళ్లు, గృహ ప్రవేశాల వంటి కార్యక్రమాలు ఊపందుకుంటాయి. గురువు అనుకూలంగా ఉన్న పక్షంలో శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. గురువు 1, 2, 5, 7, 9, 11 రాశుల్లో సంచారం చేయడమంటే కొన్ని రాశులకు దైవానుగ్రహం కలిగినట్టే భావించవచ్చు. గురువు మిథున రాశిలోకి మారిన దగ్గర నుంచి వృషభం, మిథునం, సింహం, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారి జీవితాల్లో శుభ కార్యాలు జరగడం మొదలవుతుంది.
- వృషభం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయం దిన దినాభివృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది. కుటుంబంలో అనేక సమస్యలు పరిష్కారమై, సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. ఇంట్లో తప్పకుండా శుభ కార్యాలు జరుగుతాయి. పెళ్లిళ్లు కావడంతో పాటు గృహ ప్రవేశాలు జరగడానికి కూడా అవకాశం ఉంది. సంతానం లేనివారికి సంతానం కలిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి.
- మిథునం: అత్యంత శుభ గ్రహమైన గురువు ఈ రాశిలో సంచారం చేయడం వల్ల ఆదాయం బాగా వృద్ధి చెందడంతో పాటు, అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభించే అవకాశం ఉంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. సొంత ఇల్లు ఏర్పడే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. జీవితంలో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభాల పంట పండే అవకాశం ఉంది.
- సింహం: ఈ రాశికి గురువు లాభస్థానంలో సంచారం చేయడం వల్ల ఇంట్లో తప్పకుండా శుభ కార్యాలు జరుగుతాయి. అనేక మార్గాల్లో ధన లాభాలు కలుగుతాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ప్రతి ప్రయత్నమూ విజయవంతం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడే అవకాశం ఉంది.
- తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు సంచారం వల్ల ఇంట్లో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో కొన్ని ముఖ్యమైన శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు లభించడం, పిల్లలు ఘన విజయాలు కావడం వంటివి జరుగుతాయి. సంతానం లేనివారికి సంతాన యోగానికి అవకాశం ఉంది. విదేశీయానానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసే అవకాశం కలుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశివారికి గానీ, ఈ రాశివారి కుటుంబం లోని వారికి గానీ సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలించి, గృహ ప్రవేశం చేసే అవకాశం ఉంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. నిరుద్యోగులకు కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
- కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో గురువు సంచారం వల్ల తప్పకుండా సంతాన భాగ్యం కలుగుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో అనుకోకుండా పెళ్లి సంబంధం కుదురుతుంది. గృహ ప్రవేశం చేసే అవకాశం ఉంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. వైవాహిక సమస్యలు పరిష్కారమై, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది.