
చాలా మంది నాన్‌వెజ్ ప్రియులు ఇష్టంగా తినేది చికెన్. అధిక ప్రొటిన్‌తో పాటు నోటికి మంచి రుచికరంగా ఉంటుంది. అందుకే చాలా మంది చికెన్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. ముక్క లేనిదే ముద్ద దిగని వాళ్లు కొందరుంటారు.. వీళ్లు చికెన్‌ను సరదాగా రోజూ తినేస్తారు. ఇలాంటి వాళ్లంతా కొంతకాలంగా గతం కంటే కాస్త తక్కువగా చికెన్ తింటున్నారు. మనసులో చికెన్ కుమ్మేయాలని ఉన్నా.. బర్డ్ ఫ్లూ భయంతో కాస్త తినడం తగ్గించారు. ఇటీవలె కాలంలో బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో కోళ్లు మరణించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు సైతం పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే చికెన్ లవర్స్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా బర్డ్ ఫ్లూ లేదని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ టీ.దామోదర నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని భోపాల్‌లోని జాతీయ అత్యున్నత భద్రతా జంతు వ్యాధుల సంస్థ నిర్ధారించిందని ఆయన పేర్కొన్నారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవించగా శాంపిల్స్ భోపాల్ పంపించి టెస్ట్ చేయించినట్లు చెప్పారు. పల్నాడులో బర్డ్ ఫ్లూ తో చిన్నారి మృతి చెందిన ప్రాంతంలో 70 మంది శాంపిల్స్ పరీక్షించగా నెగిటివ్ వచ్చిందని వెల్లడించారు. కాబట్టి నాన్‌వెజ్ ప్రియులు, ముఖ్యంగా చికెన్ అంటే లొట్టలేసుకునేవాళ్లు ఇక భయపడాల్సిన పనిలేదు. చికెన్‌ను ఇష్టమొచ్చినట్లు లాగించేయండి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.