
స్కోడా ఆటో ఇండియా తన సెకండ్ జెనరేషన్ 2025 స్కోడా కోడియాక్‌ను భారత మార్కెట్లో కస్టమర్ల కోసం విడుదల చేసింది. ఏడు రంగుల ఎంపికల్లో లాంచ్ చేసిన ఈ ఎస్యూవీను కంపెనీ రెండు వేరియంట్స్‌లో లాంచ్ చేసింది. స్పోర్ట్‌లైన్, ఎల్ అండ్ కే వెర్షన్స్‌లో లేటెస్ట్ అధునాతన లక్షణాలతో వస్తుంది. ముఖ్యంగా డిజైన్ విషయం గురించి మాట్లాడితే నూతన బంపర్లు, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, సీ షేప్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు, రూఫ్ రెయిల్‌లు వంటి మార్పులు స్కోడా కోడియాక్‌లో కనిపిస్తున్నాయి. ఈ ఫీచర్ల కారణంగా ఈ కారు లుక్ ప్రీమియంగా ఉంటుంది.
ముఖ్యంగా స్కోడా 2025 వెర్షన్లో సైడ్ ప్రొఫైల్‌లో క్యారెక్టర్ లైన్లు లేకపోవడం వల్ల ఈ ఎస్యూవీ చాలా పొడవుగా కనిపిస్తుంది. ఈ కారు పొడవు దాదాపు 15 అడుగుల 7 అంగుళాలు. ఈ వెనుక భాగంలో కనెక్ట్ చేసిన ఎల్ఈడీ టెయిల్ లాంప్లు ఉండడం వల్ల ఈ కారుకు మంచి ప్రీమియం లుక్ వస్తుంది. అలాగా కోడియాక్ ఇంటీరియర్ విషయానికి వస్తే సాఫ్ట్ టచ్ మెటీరియల్‌తో ఆకట్టుకుంటుంది. ఈ కారులో మసాజ్, యాంబియంట్ లైటింగ్, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, కార్ ప్లే వరకు అనేక అధునాతన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మొబైల్ చార్జింగ్ కోసం సీట్ల వద్ద ప్రత్యేకంగా సీ-టైప్ ఛార్జింగ్ పోర్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. స్కోడా కోడియాక్ కారులో 12.9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ముందు సీట్లలో హీటింగ్, వెంటిలేషన్ సిస్టమ్, మసాజ్ ఫంక్షన్, స్లైడింగ్, రిక్లైనింగ్ సీటు, సబ్‌వూఫర్‌తో ప్రీమియం 13 స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటి తాజా ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి.
స్కోడా కోడియాక్ కారును డిజైన్ చేసేటప్పుడు కస్టమర్ల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ ఎస్‌యూవీలో 9 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు 360 డిగ్రీల వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ-బ్రేకింగ్ సిస్టమ్, ఈబీడీ, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ డీసెంట్ కంట్రోల్ వంటి భద్రతా లక్షణాలు ఆకట్టుకుంటాయి. స్కోడా కోడియాక్ 2025 వెర్షన్లో 2.0 లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో, 7 స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఈ శక్తివంతమైన ఇంజిన్ 201 బీహెచ్పీ శక్తిని మరియు 320 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు స్పోర్ట్‌లైన్ వేరియంట్ ధరను రూ.46 లక్షల 89 వేలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. అలాగే ఎల్ అండ్ కే వేరియంట్‌ను కొనుగోలు చేస్తే మీరు రూ. 48 లక్షల 69 వేలు (ఎక్స్-షోరూమ్) ఖర్చు చేయాల్సి ఉంటుంది. స్కోడా కంపెనీ నుంచి అప్డేటెడ్ కోడియాక్ రిలీజ్ చేయడం వల్ల ప్రస్తుతం ఉన్న టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్ వంటి వాహనాలకు గట్టి పోటీని ఇస్తుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..