
హైదరాబాద్, ఏప్రిల్ 17: జేఈఈ మెయిన్ 2025 తుది విడత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం (ఏప్రిల్ 17) విడుదల చేయనుంది. ఈ ఏడాది జనవరిలో జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జరుగగా.. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు తుది విడత పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్-1 (బీఈ/ బీటెక్) పరీక్షలు, ఏప్రిల్ 9వ తేదీన పేపర్-2ఏ, 2బీ (బీఆర్క్/బీ ప్లానింగ్) ప్రవేశ పరీక్షలు జరిగాయి. అయితే ఈ రెండు విడతల పరీక్షల్లోని ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని విద్యార్ధులకు ర్యాంకులు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ పై అభ్యంతరాల సమర్పణ గడువు ఆదివారం అర్ధరాత్రితో ముగిసింది. అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించి తుది ఆన్సర్ కీ తోపాటు ర్యాంకులను కూడా ఈ రోజు వెల్లడించనున్నారు.
జేఈఈ మెయిన్ 2025 తుది ర్యాంకు కార్డులను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి.
కేటగిరీల వారీగా కటాఫ్ స్కోర్ నిర్ణయించి ర్యాంకులు ప్రకటిస్తారు. కటాఫ్ మార్కులు జనరల్ కేటగిరీకి 93 నుంచి 95 శాతం, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 91 నుంచి 93 శాతం, ఎస్సీ కేటగిరీకి 82 నుంచి 86 శాతం, ఎస్టీ కేటగిరీకి 73 నుంచి 80 శాతం వరకు ఉండే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ రోజు వెల్లడయ్యే తుది, మలి వితడతల్లో ఉత్తమ స్కోర్ సాధించిన మొత్తం 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు. అంటే వారు మాత్రమే మే 18వ తేదీన జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులన్నమాట.
ఇవి కూడా చదవండి
జేఈఈ–మెయిన్ ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసే వరకు వేచిచూడాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఇంజనీరింగ్ విద్యార్థులను కోరింది. ప్రొవిజినల్ కీలో ఇచ్చిన సమాధానాల ఆధారంగా అప్పటివరకు ఎటువంటి నిర్ణయానికి రావొద్దని సూచించింది. జేఈఈ మెయిన్ ప్రొవిజినల్ కీలో ఇచ్చిన సమాధానాల్లో పలు తప్పులు దొర్లాయంటూ విద్యార్థుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన నేపథ్యంలో ఈ మేరకు ఎన్టీఏ స్పష్టతనిచ్చింది. ‘పరీక్షా విధానంలో ఎన్టీఏ పూర్తి పారదర్శకతను పాటిస్తుందని తెలిపింది. దీనిని బట్టి చూస్తే తుది ఆన్సర్ కీ వచ్చక పలు ప్రశ్నలకు మార్కులు కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. తుది కీతోపాటు ర్యాంకులు కూడా ఈ రోజు విడుదలకానుండటంతో విద్యార్ధులు ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.