

భారతదేశంలో చాలా పురాతనమైన, మర్మమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలతో ముడిపడి ఉన్న అనేక ప్రత్యేకమైన రహస్యాలు, అద్భుతాల కథలు ఉన్నాయి. దీని కారణంగా ప్రజలు ఈ దేవాలయాల గురించి ప్రత్యేక విశ్వాసం కలిగి ఉన్నారు. అదేవిధంగా ఒరిస్సాలోని పూరిలో ఉన్న జగన్నాథ ఆలయంలో అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ ఆలయంలోని మూడవ మెట్టుకు సంబంధించినది. ఈ ఆలయం జగన్నాథుడు అంటే శ్రీ కృష్ణుడికి అంకితం చేయబడింది. ఈ శ్రీకృష్ణుని నగరాన్ని జగన్నాథపురి అని పిలుస్తారు. ఈ ఆలయం హిందువుల నాలుగు పవిత్ర స్థలాలలో ఒకటి. బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారక, జగన్నాథపురి. జగన్నాథపురిని ఇల వైకుంఠంగా పరిగణిస్తారు. అదే సమయంలో ఈ ఆలయంలోని మూడవ మెట్టుపై కాలు పెట్టడం ఖచ్చితంగా నిషేధించబడింది. అయితే ఇలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా..! దీని వెనుక ఉన్న కారణం ఏమిటి?
జగన్నాథ ఆలయంలోని మూడవ మెట్టు రహస్యం
పురాణాల ప్రకారం జగన్నాథుని దర్శనం చేసుకున్న తర్వాత ప్రజలు జీవితంలో చేసిన అన్ని పాపాల నుంచి విముక్తి పొందడం ప్రారంభం అయ్యేదంట. ఇదంతా చూసిన యమ ధర్మరాజు జగన్నాథుని వద్దకు చేరుకుని, “ఓ ప్రభూ.. పాపాల నుంచి విముక్తి పొందడానికి మీరు భక్తులకు ఈ సరళమైన పరిష్కారాన్ని చెప్పారు” అని అన్నాడు. నిన్ను దర్శింసుకున్నంతనే ప్రజలు తమ పాపాల నుంచి సులభంగా విముక్తి పొందుతున్నారు. ఎవరూ యమలోకానికి చేరుకోవడం లేదు. యమ ధర్మ రాజు చెప్పిన మాటలు విన్న తర్వాత జగన్నాథుడు ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న మూడవ మెట్టుపై యమ ధర్మ రాజుకి స్థానాన్ని ఇచ్చాడు. దీనిని యమ శిల అని పిలుస్తారు. నన్ను దర్శించుకున్న తర్వాత వచ్చిన పుణ్యం.. ఈ మూడవ మెట్టుపై అంటే యమశిలపై అడుగు పెడితే ఆ భక్తుడి పుణ్యమంతా కొట్టుకుపోయి యమలోకానికి వెళ్ళవలసి వస్తుందని చెప్పాడు.
మూడవ మెట్టు ఎక్కడ ఉందంటే..?
జగన్నాథ ఆలయంలోని ఈ మెట్లకు మార్గం ప్రధాన ద్వారం నుంచి ఆలయం లోపలి ప్రవేశించేటప్పుడు దిగువ నుంచి మూడవ మెట్టుని యమ శిల అంటారు. దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు మెట్లపై కాళ్ళు పెట్టవచ్చు, అయితే స్వామివారిని దర్శనం చేసుకుని.. తర్వాత ఆలయం నుంచి తిరిగి వచ్చేటప్పుడు.. ఈ యమ శిలపై కాళ్ళు పెట్టకూడదని సలహా ఇస్తారు. ఈ మెట్టు నలుపు రంగులో.. అక్కడ ఉన్న ఇతర మెట్ల కంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. పూరి జగన్నాథ ఆలయంలో మొత్తం 22 మెట్లు ఉన్నాయి. దర్శనం చేసుకున్న తర్వాత.. దిగువ నుంచి ప్రారంభమయ్యే మూడవ మెట్టును యమశిలగా గుర్తుంచుకోవాలి. ఈ మెట్టుపై పొరపాటున కూడా కాలు పెట్టవద్దు. లేకుంటే కన్నయ్య దర్శనం చేసుకోవడం వల్ల కలిగిన పుణ్యం అంతా వృధా అవుతుంది.
జగన్నాథ ఆలయంలో ఇతర రహస్యాలు
జగన్నాథ ఆలయంలోని మూడవ మెట్టు మాత్రమే కాదు.. ఈ ఆలయంతో ముడిపడి ఉన్న అనేక ఇతర రహస్యాలు ఉన్నాయి. ఈ ఆలయం మీదుగా ఏ పక్షి కూడా ఎగరదు. రెండవది ఈ ఆలయం నీడ కనిపించదు. మూడవది ఈ ఆలయం పైభాగంలో ఉన్న జెండా ఎల్లప్పుడూ వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంది. నాల్గవది ఈ ఆలయంలోకి ప్రవేశించినప్పుడు సముద్రపు అలల నుండి వచ్చే శబ్దం వినబడదు. ఈ ఆలయ రహస్యాలను ఇప్పటివరకు ఎవరూ ఛేదించలేకపోయారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.