
దేశంలోనే అత్యుత్తమ పనితీరు కబరుస్తూ.. తెలంగాణ పోలీసు శాఖ అగ్రస్థానంలో నిలిచినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రశంసించారు. తెలంగాణ పోలీసు శాఖకు, సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాల్లో పోలీసింగ్ విషయంలో తెలంగాణ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచినట్లు ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025 తేల్చింది. ఈ నివేదికను టాటా ట్రస్ట్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్ వంటి ప్రఖ్యాత సంస్థలు రూపొందించాయి. ఇందులో తెలంగాణ పోలీసులకు గొప్ప గుర్తింపు దక్కడం వారి కృషికి దక్కిన గౌరవమని, ఈ ఘనత రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినందుకు సీఎం రేవంత్ రెడ్డి యావత్ పోలీసు సిబ్బందికి ట్వీట్ ద్వారా అభినందనలు తెలిపారు. శాంతిభద్రతలు కాపాడడం, నేరాలను నియంత్రించడం, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసుల నమోదులో పారదర్శకత చూపడం ద్వారా తెలంగాణ పోలీసులు రాష్ట్రంలో శాంతి, న్యాయం నిలబెట్టడంలో విజయవంతమయ్యారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
అత్యుత్తమ పనితీరుతో తెలంగాణ పోలీసు శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినందుకు ముఖ్యమంత్రి @revanth_anumula గారు యావత్ పోలీసు సిబ్బందికి అభినందనలు తెలిపారు. ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025’ ప్రకారం, కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాలలో పోలీసింగ్ విషయంలో తెలంగాణ పోలీసు శాఖ మొదటి… pic.twitter.com/ARdZbzve3F
— Telangana CMO (@TelanganaCMO) April 16, 2025
రాజీలేని కర్తవ్య నిర్వహణతో పోలీసులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచారని, ప్రజా పాలనలో ఈ విజయం పోలీసు శాఖ సమిష్టి కృషి ఫలితమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి విజయాలను తెలంగాణ పోలీసులు సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..