
భవిష్యత్తులో సంభవించే పెను విధ్వంసాలను, ప్రమాదాలను, సంఘటనలను ముందుగానే అంచనా వేసిన బాబా వంగా గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. బల్గేరియాకు చెందిన ఈమె బతికున్న కాలంలో భవిష్యత్తులో జరగబోయే విషయాలను అంచనా వేశారు. అందులో చాలా విషయాలు ఆమె చెప్పిన సంవత్సరాల్లోనే జరుగుతూ వస్తుండటంతో అనేక మంది బాబా వంగాను విశ్వసిస్తారు. అయితే.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బాబా వంగా 2025 ఏడాదికి సంబంధించి పలు అంచనాలు వేశారు. భారీ భూకంపాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని పేర్కొన్నారు. ఆమె చెప్పినట్లే ఇటీవలె మయన్మార్, థాయ్‌లాండ్‌లో భారీ భూకంపాలు సంభవించాయి. మార్చి 28న మయన్మార్‌ను 7.7 తీవ్రతతో భూకంపం తాకింది, 2,700 మందికి పైగా మరణించారు. భూకంపాలతో పాటు ఈ ఏడాది ఆర్థిక విపత్తు కూడా సంభవిస్తుందని కూడా బాబా వంగా అంచనా వేశారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న టారిఫ్ వార్ చూస్తుంటే.. బాబా వంగా చెప్పినట్లే జరుగుతోంది అనిపిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతర దేశాలపై టారిఫ్ వార్ ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఇప్పటికే అనేకమంది బిలియన్ల సంపద ఆవిరి అయిపోయింది. ఏప్రిల్ 5 నుండి అమల్లోకి వచ్చిన 10 శాతం బేస్‌లైన్ సుంకాన్ని ట్రంప్ విధించిన తర్వాత ఇది జరిగింది. దీనిని ఆయన చారిత్రాత్మక చర్యగా అభివర్ణించారు. అమెరికాతో అధిక వాణిజ్య లోటు ఉన్న దాదాపు 60 దేశాలు లేదా ట్రేడింగ్ బ్లాక్‌ల నుండి అమెరికాలోకి ప్రవేశించే వస్తువులపై అధిక సుంకాలు విధించారు. చైనాపై 34 శాతం కొత్త సుంకాలు, యూరోపియన్ యూనియన్‌పై 20 శాతం కొత్త సుంకాలు విధించారు. అమెరికా-మెక్సికో-కెనడా ఒప్పందానికి అనుగుణంగా లేని మెక్సికో, కెనడా వస్తువులపై 25 శాతం సుంకం విధించారు.
ట్రంప్ చర్య చైనా, యూరోపియన్ యూనియన్ నుండి ప్రతీకార సుంకాలకు దారితీసింది. అమెరికన్ వస్తువులపై 34 శాతం సుంకాన్ని విధిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ఇది ట్రంప్‌కు కోపం తెప్పించింది, ప్రతీకార సుంకాలను ఉపసంహరించుకోకపోతే చైనాపై అదనంగా 50 శాతం సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అయినా చైనా వెనక్కి తగ్గకపోవడంతో అమెరికా 50 శాతం అదనపు సుంకాలను పెంచింది మొత్తం సుంకాలను 104 శాతానికి పెంచింది. దీంతో గురువారం నుంచి అన్ని అమెరికన్ వస్తువులపై 84 శాతం సుంకాలను విధిస్తున్నట్లు చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇలా రెండు అతి పెద్ద దేశాలు సుంకాలు పెంచుకుంటూ పోతుంటే.. ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. దీన్ని ఆర్థిక విపత్తుగా కచ్చితంగా చెప్పవచ్చు. ఈ టారిఫ్ వార్ ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో మరింత ఒడిదుడుకులకు దారితీసింది. ఈ క్రాష్ కారణంగా బిలియనీర్లు మార్కెట్లో ట్రిలియన్ల డాలర్లను కోల్పోయారు. ఇలా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే.. ఈ టారిఫ్ వార్ ఎక్కడికి దారితీస్తుందో అని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే.. కొన్ని రోజుల్లోనే ప్రపంచ మొత్తం ఆర్థిక సమస్యలతో అతలాకుతలం అవ్వడం, వస్తువుల ధరలు భారీ పెరగడం, అధిక ద్రవ్యోల్బణం వంటి సమస్యలు ఎదుర్కొక తప్పేలా లేదు. మరి ఇవన్నీ చూస్తుంటే.. బాబా వంగా చెప్పింది చెప్పినట్లు కనిపిస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.