
వివాహం జరిగి కేవలం 22 రోజులే అయింది. అంతలోనే ఆ నవవధువు కాటికి పయనమైంది. అత్తారింటి వేదింపులు భరించలేక ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ హృదయ విదారక ఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గొల్లపల్లిలో చోటు చేసుకుంది.
హాజీపూర్ మండలం టికానపల్లి గ్రామానికి చెందిన కంది కవిత, శ్రీనివాస్ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. చిన్న కూతురు శృతిని ఇదే మండలానికి చెందిన పెద్దంపేట గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన ఘర్షకుర్తి సాయికి ఇచ్చి గత మార్చి నెల16వ తేదీన ఘనంగా వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో వరకట్నం కింద 9 తులాల బంగారం, రూ .5 లక్షల కట్నకానుకలు సమర్పించారు. వివాహ సమయంలో ఒప్పుకున్న విధంగానే అబ్బాయికి అన్ని లాంచనాలు అందించి నవ వధువును మెట్టినింటికి సాగనంపారు.
అయితే అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ వారం రోజులకే కన్నీళ్లు పెట్టుకుంటూ పుట్టింటి బాట పట్టింది నవ వధువు శృతి. భర్త సాయితోపాటు అత్తా లక్ష్మి, మామ శంకరయ్య మానసికంగా ఇబ్బంది పెడుతూ పెళ్లికి అయిన ఆరు లక్షల రూపాయలు ఖర్చును పుట్టింటి నుండి తేవాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో చేసేదీలేక శృతి తల్లిదండ్రులు సోమవారం(ఏప్రిల్ 7) రాత్రి 50 వేల రూపాయలు సాయికి అందజేశారు. మిగతా సొమ్మును తొందరలోనే ముట్టచెపుతామని నచ్చజెప్పి శృతి తల్లిదండ్రులు టీకనపల్లి గ్రామానికి తిరిగి వెళ్లారు.
ఇంతలోనే మళ్లీ ఏమైందో తెలియదు కానీ తెల్లవారుజామున 6 గంటల సమయంలో అత్తగారింట్లోని బాత్రూంలో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది శృతి. ఈ సమాచారం అందుకున్న శృతి తల్లిదండ్రులు బోరున విలపించారు. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లై ముచ్చటగా మూడు వారాలు కూడా తిరగక ముందే వరకట్న వేదింపులకు పాల్పాడ్డారని.. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన బిడ్డను చంపేశారని కన్నీరుమున్నీరయ్యారు శృతి తల్లిదండ్రులు. శృతి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు.. శృతి భర్త సాయితోపాటు మృతురాలు శృతి అత్త, మామలను అదుపులోకి తీసుకున్నారు. 22 రోజులకే నవ వధువు మృతి చెందడం అటు టికానపల్లిలో ఇటు గొల్లపల్లిలో విషాద చాయలు నింపింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..