
బెజవాడ దుర్గమ్మ, భీమవరం మావూళ్లమ్మ, ద్వారకాతిరుమల కుంకుళ్లమ్మ..ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో గ్రామ దేవత పూజలందుకుంటుంది. ఆయా గ్రామదేవతలకు ప్రతియేటా ఉత్సవాలు, జాతరలు సైతం ఘనంగా జరుగుతుంటాయి. భక్తులు, సమీప ప్రాంతాల వారు ఆలయనికి చేరుకుని పూజలు చేసి తమ తమ మొక్కులు తీర్చుకుంటారు. కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న క్షేత్రం ద్వారకాతిరుమల. చిన వెంకన్నగా భక్తులతో విశేష పూజలందుకుంటున్నారు. ఈ క్షేత్రంలో దేవతగా కుంకుళ్లమ్మ కొలువై ఉన్నారు. ప్రస్తుతం కుంకుళ్లమ్మ ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈనెల 7 వరకు కుంకుమ పూజలు నిర్వహిస్తున్నారు. తర్వాత చండీ హోమం జరుగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారికి ఐదు లక్షల గాజులుతో అలంకరించారు. గర్భాలయంలో వివిధ వర్ణాలతో కూడిన గాజులు దండలు అమ్మవారికి అలంకరించటంతో పండు ముత్తయిదువులా కుంకుళ్లమ్మ దర్శనం ఇస్తున్నారు.
ఉత్సవాలు ముగిసిన తర్వాత భక్తులకు అమ్మవారికి అలంకరించిన గాజులను పంపిణి చేస్తారు. వీటిని మహిళలు శుభకరంగా భావించి తమ చేతులకు ధరిస్తారు. దీని వల్ల తమకు అంతా మంచి జరుగుతుంది అని భక్తుల విశ్వసిస్తారు. ఈ కార్యక్రమాలు ఆలయ అర్చకులు భైరవ స్వామి పర్యవేక్షణలో జరుగుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..