
ఐపీఎల్ 18 సీజన్ ప్రారంభమైన మూడో రోజు ఓ కుర్రాడి పేరు మారుమోగిపోయింది. వామ్మో.. ఏంటి భయ్యా ఆ విధ్వంసం అంటూ క్రికెట్ లోకం మొత్తం అతన్ని కీర్తించింది. ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టును ఒంటిచేత్తో బయటికి లాక్కొచ్చి.. గెలుపు రుచి చూపించాడు. సీజన్లో ఫస్ట్ మ్యాచ్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరుపురాని విజయాన్ని అందించాడు. ఇప్పటికే ఆ కుర్రాడు ఎవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్.. అతనే అశుతోష్ శర్మ. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ 65/5తో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో అశుతోష్ అద్భుతమే చేశాడు. 31 బంతుల్లో 66 రన్స్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఒక్క వికెట్ తేడాతో గెలిపించాడు.
దీంతో అశుతోష్ శర్మ పేరు క్రికెట్ లోకంలో మారుమోగిపోయింది. ఈ క్రమంలోనే రైల్వేస్ హెడ్ కోచ్ నిఖిల్ డోరు 2024 జనవరిలో గుజరాత్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో అశుతోష్ అరంగేట్రం గురించి మాట్లాడాడు. సెలెక్టర్లు అశుతోష్‌ను జట్టులోకి తీసుకోవడానికి ఇష్టపడలేదని, అతనికి బ్యాటింగ్ ఎలా చేయాలో తెలియదని సెలెక్టర్లు అన్నట్లు సంచలన విషయాలను బయటపెట్టారు. అయితే మెంటల్‌గా ఎంతో స్ట్రాంగ్ ఉండే అశుతోష్ వాళ్లందరూ తప్పు అని నిరూపించాడని అన్నారు. తన రంజీ ట్రోఫీ అరంగేట్రంలోనే, అశుతోష్ సెంచరీ సాధించి, తన జట్టును క్లిష్ట పరిస్థితి నుండి కాపాడి, రెడ్-బాల్ క్రికెట్లోకి తన ఎంట్రీని ఘనంగా చాటాడు.
రంట్రీ ట్రోఫీ కోసం రైల్వేస్ టీమ్‌లోకి అశుతోష్‌ను ఎంపిక చేయమంటే.. అతనికి బ్యాటింగ్ చేయాలో కూడా తెలియాదు, అతను అడ్డిగుడ్డిగా షాట్లు మాత్రమే ఆడతాడు అని సెలెక్టర్లు అశుతోష్‌ను అవమానించారనే విషయాన్ని ఆయన వెల్లడించారు. కాగా, గతేడాది ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున మంచి ప్రదర్శన కనబర్చినా కూడా అశుతోష్‌ను పంజాబ్ కింగ్స్ రిటేన్ చేసుకోలేదు. ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ అతన్ని కేవలం రూ.3.8 కోట్ల ధరకు మాత్రమే కొనుగోలు చేసింది. ఇప్పుడు తొలి మ్యాచ్‌లోనే తన సత్తా ఏంటో చూపించి, తనను అవమానించిన సెలెక్టర్లకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.