
వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో అకస్మాత్తుగా పేలిన డిటోనేటర్ స్థానికులందరూ ఉలిక్కిపడేలా చేసింది. బస్టాండ్ నిర్మాణంలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా పేల్చిన డిటోనేటర్ ఈ ప్రమాదానికి కారణమైంది. బండరాళ్లు ఎగిరిపడి ఆర్టీసీ బస్సుపై పడి అద్దాలు పగిలాయి. అయితే ప్రమాద సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపరిపీల్చుకున్నారు. కానీ, పేలుడుపై పోలీసులు విచారణ చేపట్టారు. వరంగల్ నగరం నడిబొడ్డున ఈ ప్రమాదం జరిగింది. మోడల్ బస్టాండ్ నిర్మాణంలో భాగంగా కాంట్రాక్టర్లు, అధికారుల ఇష్టారాజ్యం ప్రమాదాలకు కారణంగా మారుతుంది. పిల్లర్ల నిర్మాణం కోసం గుంతలు తీస్తుండగా భూమిలో బండరాళ్లు అడ్డుపడ్డాయి.
బండరాళ్లను తొలగించడం కోసం నిబంధనలకు విరుద్ధంగా డిటోనేటర్లు పెట్టీ పేలుళ్లు జరిపారు. పేలుడు ధాటికి రాళ్ళు ఎగిరి చెల్లా చెదురుగా పడ్డాయి. ఓ బండరాయి పక్కనే ఉన్న బస్సుపై పడి అద్దాలు ధ్వంసం అయ్యాయి. అది భూపాలపల్లి డిపోకు చెందిన బస్సుగా తెలుస్తోంది. బస్సుపై హఠాత్తుగా బండరాళ్లు పడడంతో అందులో ప్రయాణికులు అంతా భయభ్రంతులకు గురయ్యారు. అయితే రాళ్లు వచ్చి పడటంతో బస్సులో ఇద్దరికి స్వల్పగాయాలు అయ్యాయి. ఈ ఘటన జరిగిన తర్వాత ఆలస్యంగా తేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. డిటోనేటర్లు ఎక్కడి నుండి వచ్చాయి? ఎవరు పేల్చారు? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.