
Ravindra Reddy – Lokesh Meeting Controversy: విద్యార్ధుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రముఖ టెక్ కంపెనీ సిస్కోతో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి లోకేష్ సమక్షంలో అధికారులు ఎంవోయూ చేసుకున్నారు. దీని ద్వారా 50 వేల మంది యువతకు డిజిటల్, ఐటీ స్కిల్ డెవలెప్మెంట్లో సిస్కో సంస్థ శిక్షణ ఇవ్వనుంది. ఇంతవరకూ భాగానే ఉన్నా.. సిస్కో టీమ్‌లో ఇప్పాల రవీంద్రారెడ్డి అనే వ్యక్తి కనిపించడంపై టీడీపీ సోషల్‌మీడియాలో తీవ్ర దుమారం రేగింది. ఎంవోయూ మొత్తాన్నీ రవీంద్రారెడ్డి కోఆర్డినేట్ చేసినట్లు తెలుసుకుని ఖంగుతిన్నాయి. దాంతో.. రవీంద్రారెడ్డి హాజరుపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో రవీంద్రారెడ్డి పెట్టిన పోస్టులను మళ్లీ వైరల్ చేశారు. మంత్రిని కలిసేందుకు రవీంద్రారెడ్డిని ఎలా రానిచ్చారని నిలదీయడంతో లోకేష్ కూడా సీరియస్ అయ్యారు. తన పేషీ టీమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అలెర్ట్ అయి.. వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టారు అధికారులు..
సిస్కోలో టెరిటరీ అకౌంట్స్ మేనేజర్‌గా బాధ్యతలు
ఇప్పాల రవీంద్రారెడ్డి ప్రస్తుతం సిస్కోలో టెరిటోరియల్ అకౌంట్స్ మేనేజర్ హోదాలో పని చేస్తున్నారు. ఆ హోదాలోనే ఏపీ ప్రభుత్వంతో సిస్కో ఎంవోయూ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే.. ఓ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేసిన వ్యక్తిని సిస్కో సంస్థ బృందంతో పంపించడంపై మంత్రి లోకేష్ కార్యాలయం అభ్యంతరం వ్యక్తం చేసింది. మంత్రి లోకేష్ ఆదేశాలతో సిస్కో కంపెనీకి స్ట్రాంగ్ మెయిల్ పెట్టింది. సోషల్ మీడియాలో రవీంద్రారెడ్డి టీడీపీ అధినాయకత్వంతోపాటు పార్టీ నేతలపై పెట్టిన పోస్టులను ప్రస్తావించింది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో ఏపీ ప్రభుత్వంతో సిస్కో చేపట్టే ప్రాజెక్టు వ్యవహారంలో ఇప్పాల రవీంద్రారెడ్డిని పక్కన పెట్టాలని స్పష్టం చేసింది. ఫలితంగా.. సిస్కోలో ఇప్పాల రవీంద్రారెడ్డి జాబ్ రిస్క్‌లో పడింది. ఆయన ఉద్యోగంపై ఆ కంపెనీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అంతేకాదు.. టీడీపీ శ్రేణులు భగ్గుమంటుండడంతో ఇప్పాల గత వ్యవహారాలపైనా ఏపీ ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
2014-19 కాలంలో టీడీపీ టార్గెట్‌గా ఇష్టారీతి పోస్టులు..
ఇంతకీ.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరు?… ప్రకాశం జిల్లాకు చెందిన రవీంద్రారెడ్డి.. ఒకప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో కీలకంగా వ్యవహరించారు. వైసీపీలో అధికారిక పదవుల్లో లేకపోయినా 2014-19 మధ్య కాలంలో టీడీపీ టార్గెట్‌గా సోషల్ మీడియాలో ఇష్టారీతి పోస్టులు పెట్టి వైసీపీ యాక్టివిస్ట్‌గా గుర్తింపు పొందారు. టీడీపీ పెద్దలపై అనుచిత పోస్టులు పెట్టడంతో నేటి హోంమంత్రి అనిత ఫిర్యాదు మేరకు కేసుల్లోనూ ఇరుక్కున్నారు. ఆయా కేసుల్లో అరెస్ట్ కాగా.. రవీంద్రారెడ్డిని స్వయంగా జగనే పరామర్శించారు. అయితే.. వరుస కేసులతో రవీంద్రారెడ్డి వ్యవహారం దుమారం రేపడంతో వైసీపీ అతన్ని దూరం పెట్టింది. ఆయనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఏకంగా వైసీపీ అధినాయకత్వమే ప్రకటన చేసింది. దాంతో.. అప్పటినుంచి వైసీపీకి దూరంగా ఉంటున్నారు. కానీ.. తాజాగా సిక్కో ఒప్పంద కార్యక్రమంలో దర్శనమివ్వడంతో రవీంద్రారెడ్డి మరోసారి హాట్‌టాపిక్‌గా మారారు. ఈ క్రమంలోనే.. టీవీ9తో మాట్లాడిన రవీంద్రారెడ్డి.. అప్పట్లో జరిగిన పరిణామాలతో పొలిటికల్‌గా యాక్టివ్‌గా లేనని తెలిపారు. సిస్కోలో ఉద్యోగం చేసుకుంటూ పలు రాష్ట్రాల్లో పెట్టుబడుల అంశాలను పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఏదేమైనా.. గత పరిస్థితుల నేపథ్యంలో ఇప్పాల రవీంద్రారెడ్డి వ్యవహారాన్ని టీడీపీ శ్రేణులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయి. అటు.. ఇప్పాల వ్యవహారాలపై ఏపీ ప్రభుత్వం కూడా ఎంక్వైరీ చేయబోతుండడంతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..