
పెళ్లైన కొత్తలో దంపతులకు అంతా బాగానే సాగుతుంది. అయితే సంవత్సరాలు గడిచేకొద్దీ.. వైవాహిక జీవితంలో నైరాశ్యం నెలకొంటుంది. సంతోషకరమైన జీవితాన్ని గడపాలని భావించినా.. మనసులు వ్యతిరేక దిశలో పయనించవచ్చు. అంతే కాదు భార్యాభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకోక పొతే కలిసి జీవించడం కష్టం అవుతుంది. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో భర్త తన భార్యకు శత్రువుగా ఎలా మారుతాడో లేదా భార్యాభర్తల మధ్య సంబంధం ఎందుకు విచ్ఛిన్నమవుతుందో వివరించాడు. దంపతులు కొన్ని విషయాలను సరిదిద్దుకుంటేనే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని ఆయన హెచ్చరించాడు.
- ఎగతాళి: జీవితంలో కష్టాలు అందరికీ వస్తాయి. సంతోషం, దుఃఖం ఒకే నాణేనికి రెండు వైపులా ఉంటాయి. కష్ట సమయాల్లో భాగస్వాములిద్దరూ ఒకరినొకరు విడిచిపెట్టకూడదు. భార్యాభర్తలు ఒకరినొకరు ఏ విషయంలోనూ ఎగతాళి చేసుకోకూడదు. జీవిత సమస్యలకు కారణమని ఒకరిని ఎగతాళి చేయడం.. ఆరోపించడం వల్ల భార్యాభర్తల మధ్య అంతరం ఏర్పడుతుంది. కనుక జీవితంలోని చిన్న చిన్న విషయాలను విస్మరించడం నేర్చుకోండి. మీరు ఇలా చేయకపోతే.. వివాహ జీవితంలో ఇబ్బందులు తప్పవు. భార్యాభర్తల మధ్య బంధం బీటలు పడే అవకాశం ఉంది.
- సంభాషణ లేకపోవడం: వైవాహిక జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా.. భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వాదనలు సర్వసాధారణం. కనుక ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా దూరంగా ఉండవద్దు. మాటలు లోపిస్తే ఇద్దరి మధ్య దూరం పెరిగి వైవాహిక జీవితంలో సామరస్యం తగ్గుతుంది.
- కోపం తెచ్చుకోవడం: కోపం భార్యాభర్తల మధ్య ఉన్న అన్ని సంబంధాలను ముగిస్తుంది. కోపం మనిషిలోని జ్ఞానాన్ని మరిపిస్తుంది. భార్యాభర్తలిద్దరూ కోపంగా ఉన్నప్పుడు కఠినంగా ప్రవర్తించకూడదు. సమస్యను ప్రశాంతంగా పరిష్కరించుకోవడం ముఖ్యం. అంతేకాదు కోపంలో మాట్లాడే మాటలు సంబంధానికి ముగింపు ఇవ్వగలవు. కనుక భార్యాభర్తలు బంధం నిలుపుకోవాలంటే తమ కోపాన్ని అదుపులో ఉంచుకోండి అని సూచించాడు.
- అధిక ఖర్చులు: జీవించడానికి డబ్బులు చాలా అవసరం. భార్యాభర్తలిద్దరూ డబ్బును ఎలా ఖర్చు చేయాలో స్పష్టమైన అవగాహన కలిగి ఉంటేనే అనుకూలత సాధ్యమవుతుంది. కుటుంబ సౌకర్యాల కోసం ఖర్చు చేయడం మంచిది. అయితే అనవసరమైన ఖర్చు.. ఆర్థిక సమస్యలను తీసుకోస్తుడి. అప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు కూడా జరుగుతాయి. కనుక డబ్బులు ఖర్చు పెట్టె విషయంపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.
- వ్యక్తిగత విషయాలను ఇతరులకు చెప్పడం: భార్యాభర్తల మధ్య విషయాలలో గోప్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. వీరిద్దారూ తమ మధ్య ఉన్న విషయాలను రహస్యంగా ఉంచుకోవాలి. ఈ రహస్యాలను మూడవ వ్యక్తికీ ఎప్పుడూ చెప్పకూడదు. భార్యాభర్తలు వ్యక్తిగత సమాచారం మూడవ వ్యక్తులకు తెలియకుండా జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి మూడవ వ్యక్తి నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటే.. అది వైవాహిక జీవితంలో వివాదాలకు దారితీస్తుంది.
- పదే పదే అబద్ధం చెప్పడం: భార్యాభర్తల మధ్య సంబంధం ప్రేమ, నమ్మకం, విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ఈ నమ్మకం సంబంధానికి దృఢమైన పునాది. అయితే కొన్నిసార్లు అనివార్య పరిస్థితుల వల్ల తప్పని సరి పరిస్థితిల్లో అబద్ధాలు చెబుతారు. అయితే అబద్ధం చెప్పడం అలవాటు చేసుకుంటే..భార్యాభర్తల మధ్య సంబంధం విచ్ఛిన్నం కావడానికి మార్గం సుగమం చేసుకున్నట్లే. అయితే తమ భాగస్వామికి నిజం చెప్పడం ద్వారా భార్యాభర్తలు ఒకరిపై ఒకరు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చాణక్య చెప్పాడు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు