
ఐపీఎల్ 2025 సమరానికి అంతా సిద్ధమవుతోంది. అందరికంటే ముందు ఎల్లో సైన్యం కూడా రెడీ అయిపోయింది. ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్‌లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సారి ఆరో కప్పుపై కన్నేసింది. పైగా.. ఆ జట్టులో అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ఆడుతున్న 43 ఏళ్ల కుర్రాడు ధోనికి ఇది లాస్ట్ సీజన్ అని మరోసారి ప్రచారం జరుగుతోంది.. లాస్ట్ లాస్ట్ అనేసి ఇప్పికే రెండు మూడు సీజన్లు ఆడేశాడని అనుకోకండి. ఈ సారి ఎందుకో నిజంగానే రిటైర్మెంట్ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇదే సీఎస్కేకు ఎమోషనల్ స్ట్రెంత్ కానుంది. ధోని లాంటి ఒక గొప్ప కెప్టెన్‌కు, గొప్ప ఆటగాడికి కప్పు కొట్టి వీడ్కోల గిఫ్ట్ ఇవ్వాలనే ఎమోషన్ సీఎస్కే జట్టులో ఉంటుంది. సో.. అందుకోసమైనా ఆరో కప్పు కొట్టాలని వాళ్లు బలంగా ఫిక్స్ అయి ఉంటారు. మరి వాళ్ల ఆరో కప్పు కొట్టేందుకు సీఎస్కే ఎంత స్ట్రాంగ్‌గా ఉంది? జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతుంది? జట్టులో మైనస్‌లు ఏమైనా ఉన్నాయా? అనే విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం..
ఈ సీజన్లో సీఎస్కే ఎక్కువగా ఆల్‌రౌండర్లు, స్పిన్నర్లపై ఆధారపడి బరిలోకి దిగుతున్నట్లు వాళ్ల జట్టు చూస్తే అర్థం అవుతుంది. కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఇప్పుడిప్పడే నిలదొక్కుకుంటున్నా.. అతని వెనుక ధోని అనే ఒక మాస్టర్ మైండ్ ఉంది. అతనే సీఎస్కే బలం. సాధారణ జట్టులో కూడా కప్పులు కొట్టించే సత్తా ఉన్నోడు ధోని. ఈసారి కూడా అలాంటి మ్యాజిక్ రిపీట్ చేయాలని సీఎస్కే భావిస్తోంది. అందుకోసం వారి బ్యాటింగ్ బలం ఎలా ఉందో చూస్తే.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వె, రాహుల్ త్రిపాఠి, రచిన్ రవీంద్రా, విజయ్ శంకర్, దీపక్ హుడా, సామ్ కరణ్, శివమ్ దూబే, రవీంద్రా జడేజాతో బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్‌గానే ఉంది. కానీ, మరీ అంతా విధ్వంసం సృష్టించే బ్యాటర్లు ఎవరు కనిపించడం లేదు. ధోని ఉన్నా.. గత సీజన్లోనే చివర్లో బ్యాటింగ్‌కి వచ్చాడు, కొన్ని మ్యాచ్‌ల్లో అసలే రాలేదు.
మరి ఈసారి కూడా వస్తాడో లేదో తెలియదు. సో బ్యాటింగ్ విషయంలో ధోనిపై ఎక్కువ ఆశలు పెట్టుకోలేం. ఈ సీజన్లో సీఎస్కే బలం మాత్రం ఆల్‌రౌండర్లు, స్పిన్నర్లు. ఒక వేళ ఆరో కప్పు కొడితే మాత్రం.. వీరి వల్లే కొడతారు. అంతేకానీ బ్యాటింగ్ బలంతో మాత్రం సీఎస్కే మ్యాచ్‌లు గెలవడం కష్టం. ఒకసారి సీఎస్కే ఆల్‌రౌండర్ల గురించి మాట్లాడుకుంటే.. శివమ్ దూబే, జడేజా, సామ్ కరన్ కచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండే ప్లేయర్లు. జట్టుకు మిడిల్డార్‌లో బలం, బౌలింగ్‌లో ఎక్కువ ఓవర్ల షేరింగ్ వీరిదే. సీఎస్కే గెలుపోటముల్లో వీరి పాత్ర ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక చెన్నై హోం గ్రౌండ్ ఎంఏ చిదంబరం స్టేడియం అదే చెపాక్ టర్నింగ్ ట్రాక్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకోసమే ప్రతిసారి లాగే ఈ సారి కూడా చెన్నై మంచి మంచి స్పిన్నర్లను టీమ్‌లోకి తీసుకొంది.
లోకల్ ప్లేయర్.. చెపాక్ పిచ్ గురించి అణువణువు తెలిసిన లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సీఎస్కే టీమ్‌లో ఉండటం వారికి కొండంత అండ. ప్రత్యర్థి జట్టులో ఉండే లెఫ్ట్ హ్యాండర్లు చెన్నైలో మ్యాచ్ అంటే అశ్విన్‌కు భయపడాల్సిందే. అంతలా తన స్పిన్ మాయాజాలం ప్రదర్శిస్తాడు అశ్విన్. అతనితో పాటు అఫ్ఘానిస్థాన్ యువ స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా సీఎస్కేలో ఉన్నాడు. అశ్విన్, అహ్మద్ జోడీ కచ్చితంగా ప్రత్యర్థి జట్లకు గట్టి సవాల్ విసురుతుందని చెప్పొచ్చు. ఇక వీళ్లు కాకుండా పేస్ బౌలింగ్‌లో శ్రీలంక ఆటగాడు మతీష పతిరణ, ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరీ, నాథన్ ఎల్లీస్ గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఇక సీఎస్కేలో మైనస్‌ల విషయానికి వస్తే.. రుతురాజ్‌పై కెప్టెన్సీ భారం కనిపిస్తోంది. అది అతని బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతోంది. క్వాలిటీ బ్యాటర్ల కంటే.. ఆల్రౌండర్లపై ఎక్కువ ఆధారపడటం సీఎస్కేకు కాస్త మైనస్ కావొచ్చు. పేస్ బౌలింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది.
ఇక సీఎస్కే హోం గ్రౌండ్ ఎలాగో స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది కనుక.. మంచి స్పిన్నర్లను తీసుకున్నారు. సో.. హోం పిచ్ అడ్వాంటేజ్‌ను సీఎస్కే పూర్తిగా ఉపయోగించుకోనుంది. ఇక లాస్ట్ బట్నాట్ లీస్ట్.. ధోనికి ఇదే చివరి సీజన్ అయి ఉంటే మాత్రం.. సీఎస్కే టీమ్ వేరే మోటోతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఎలాగైనా కప్పు గెలిచి ధోనికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని జట్టులోని సభ్యులంతా బలంగా ఫిక్స్ అవుతారు. ఇది వారికి ఎమోషనల్ స్ట్రెంత్‌ను కచ్చితంగా ఇస్తుంది. 2011లో టీమిండియా ఆటగాళ్లు ఎలాగైతే సచిన్ కోసం వరల్డ్ కప్ గెలుస్తామని బలంగా ఫిక్స్ అయ్యారో.. ఈ సీజన్లో ధోని కోసం కప్పు గెలుస్తామంటూ సీఎస్కే టీమ్ కూడా ఫిక్స్ కావొచ్చు. అందుకే ఇది టీమ్ కాదు.. ధోని సైన్యంలా మారే ఛాన్స్ ఉంది.
ఇక చివరిగా.. ది బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉంటుందని అనుకుంటే.. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, శివమ్ దూబే, ధోని, రవిచంద్రన్ అశ్విన్, సామ్ కరన్, మతీషా పతిరణ, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.