

భోపాల్, మార్చి 18: ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం చేశాడు. పోస్టుమార్టంలో అసలు సగతి బయటపడటంతో నేరం అంగీకరించాడు. మధ్యప్రదేశ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ప్రదీప్ గుర్జార్ భార్య (22)ను ఎలాగైనా చంపాలని భావించాడు. ఇందుకు టీవీలో క్రైం షోలు చూసి పథకం పన్నాడు. పథకం ప్రకారం తొలుత భార్యను కొట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కంపూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రోడ్డుపై పడేశాడు. రోడ్డు ప్రమాదంలో తనకు కూడా స్వల్ప గాయాలైనట్లు సీన్ క్రియేట్ చేశాడు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు కూడా తొలుత ప్రదీప్ చెప్పింది నిజమేనని భావించారు.
అయితే ప్రదీప్ వాంగ్మూలంలోని వైరుధ్యాలు, పొంతనలేని మాటలు పోలీసులకు అనుమానం తెప్పించాయి. పైగా ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని, చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు పోస్ట్‌మార్టం పరీక్షలో తేలింది. దీంతో అనుమానంతో పోలీసులు మృతురాలి భర్త ప్రదీప్‌ను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. క్రైమ్ టీవీ షోలు చూసి తన భార్య హత్యకు ప్లాన్ చేశాడని విచారణలో ప్రదీప్ చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. ప్రదీప్‌ను అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. అతనితోపాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదు చేశారు.
కట్నం కోసం ప్రదీప్ తన భార్యను వేధించేవాడంటూ మృతురాలి బంధువులు ఆరోపించారు. అసలు భార్యను చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టులో కూడా వెల్లడైంది. పోలీసులు ప్రదీప్‌తోపాటు అతని తండ్రి రాంవీర్ గుర్జార్, అతని బంధువులు బన్వారీ, సోను గుర్జార్‌లపై కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.