
ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకునే దిశగా భారతదేశం, అమెరికా దేశాలు ముందుకు సాగుతున్నాయి. ఈ సందర్భంగా వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంచడంపై చర్చించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్‌తో సమావేశమయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ సమావేశం రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంచడంపై దృష్టి సారించింది.
ఈ సందర్భంగా మహాకుంభ్ సమయంలో సేకరించిన పవిత్ర జలాన్ని ప్రధాని మోదీ తులసి గబ్బర్డ్‌కు బహూకరించారు. డోనాల్డ్ ట్రంప్ రెండోవిడత కార్యవర్గంలోని సీనియర్ స్థాయి అధికారి తొలిసారి భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. తులసి గబ్బర్డ్ తన రెండున్నర రోజుల పర్యటన కోసం ఆదివారం తెల్లవారుజామున దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్‌ను కలిసిన తులసి, సోమవారం ఉదయం ఢిల్లీలో నిర్వహించిన గ్లోబల్ ఇంటెలిజెన్స్ చీఫ్‌ల సమావేశంలో పాల్గొన్న తర్వాత రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చలు జరిపారు. ఈ సాయంత్రం ప్రధాని మోదీని కలిశారు.