
మెగాస్టార్ చిరంజీవి.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు.. ఇండియన్ సినిమాలో తనకంటూ పేజీ కాదు.. ఏకంగా గ్రంథాన్నే లిఖించుకున్న అరుదైన నటులు చిరంజీవి. నాలుగున్నర దశాబ్దాలకు పైగానే సినిమాను రూల్ చేస్తున్నారీయన.
ఈ ప్రయాణంలో ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న చిరంజీవి.. తాజాగా యుకే పార్లమెంట్ నుంచి అరుదైన సత్కారం అందుకోబోతున్నారు. చిరంజీవికి యూకే పార్లమెంట్లోని గ్రూప్ ఆఫ్ ఎంపీలు కలిసి లైఫ్ టైమ్ అఛీవ్మెంట్తో సత్కరించబోతున్నారు.
మార్చి 19న జరిగే ఈ కార్యక్రమానికి సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు హాజరు కానున్నారు. అదే వేదికపై సినిమాలతో పాటు ప్రజాసేవ, దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నారు బ్రిడ్జ్ ఇండియా సంస్థ.
చిరంజీవిని ఈ మధ్య వరసగా అవార్డులు, గౌరవాలు వరిస్తూనే ఉన్నాయి. గతేడాది దేశ రెండో అత్యున్నత పురస్కార్ పద్మ విభూషణ్ చిరంజీవి కీర్తి కిరీటంలో చేరింది. అలాగే డాన్సుల్లో ఆయన సాధించిన ఘనతను గుర్తించి గిన్నీస్ బుక్లో చోటిచ్చారు. డాన్సుల్లో గిన్నీస్ రికార్డు అందుకున్న నటుడు ప్రపంచంలో చిరు తప్ప ఎవరూ లేరు. 156 సినిమాల్లో.. 537 పాటల్లో.. 24000 డాన్స్ మూవ్స్ చేసారు చిరంజీవి.
ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో చిరంజీవికి ప్రతిష్టాత్మక ఎ.ఎన్.ఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేసింది. ఇలా కొన్నేళ్లుగా వరసగా ఆయనకి అరుదైన గౌరవాలు అందుతూనే ఉన్నాయి. తాజాగా యుకే పార్లమెంట్లోని గ్రూప్ ఆఫ్ ఎంపీస్ నుంచి నుంచి జీవిత సాఫల్య పురస్కారం అందుకోబోతున్నారు.