

ఇంట్లో పూరీలు చేసుకోవడంలో నూనె ఎక్కువ పీల్చకుండా ఉండాలంటే సింపుల్ చిట్కా ఉంది. పూరీలు పొంగి, క్రిస్పీగా రావాలంటే పిండిలో కొద్దిగా ఉప్మా రవ్వ కలపాలి. రవ్వ కలిపితే పూరీలు నూనె ఎక్కువ పీల్చకుండా చక్కగా పొంగుతాయి. పైగా పూరీలు ఎక్కువ సేపు మృదువుగా అలాగే ఉంటాయి.
కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి – 2 కప్పులు
ఉప్మా రవ్వ – 3 స్పూన్లు
పంచదార – 1 టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – కొద్దిగా
తయారీ విధానం
ముందుగా పెద్ద గిన్నెలో గోధుమ పిండి, ఉప్మా రవ్వ, పంచదార, ఉప్పు వేసి కలపాలి. దీంట్లో గోరు వెచ్చని నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా కలపాలి. నీళ్లు ఒకేసారి ఎక్కువగా పోసుకోకుండా కొంచెం కొంచెం పోస్తే పిండి కుదురుతుంది. పిండిని అరగంట పాటు నానబెట్టాలి. ఈ సమయంలో రవ్వ వల్ల పిండి కాస్త గట్టిపడుతుంది. అందుకే పూరీలను గట్టిగా వత్తి పక్కన పెట్టాలి.
పూరీలు కాస్త మందంగా వత్తుకుంటే పూరీ సరిగా పొంగుతుంది. పలుచగా వత్తుకుంటే పూరీలు సరిగా పొంగవు. కాబట్టి కాస్త మందంగా వత్తి మంచి క్రిస్పీ పూరీలు రావడానికి ఈ పద్ధతి పాటించాలి.
పూరీలను కాల్చేటప్పుడు కడాయిలో పూరీలు మునిగిపోయేంత నూనె పోయాలి. మంట హై ఫ్లేమ్‌లో ఉండాలి. మంట తక్కువగా ఉంటే పూరీలు నూనె పీల్చి, సరిగా పొంగవు. పూరీలు వేసి అవి పైకి రాకుండా సున్నితంగా జల్లెడతో వత్తితే చాలు. పూరీలు సరిగ్గా పొంగి క్రిస్పీగా తయారవుతాయి.