
ఈ నెల 21 నుంచి మీన రాశిలో ఒక విచిత్ర పరిస్థితి చోటు చేసుకుంటోంది. ఉచ్ఛ స్థితిలో ఉన్న శుక్రుడు, నీచ స్థితిలో ఉన్న బుధుడు ఈ రాశిలో ఒకేసారి వక్రించడం జరుగుతోంది. ఒక ఉచ్ఛ గ్రహం, ఒక నీచ గ్రహం ఒకే రాశిలో వక్రించడం అనేది చాలా అరుదుగా జరిగే విశేషం. ఈ పరిస్థితి ఏప్రిల్ 7వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఇటువంటి వక్ర గతి వల్ల ప్రతి విషయంలోనూ వ్యాపార ధోరణి పెరిగే అవకాశం ఉంటుంది. ఆదాయం పెరుగుతున్న కొద్దీ పిసినారిగా వ్యవహరించడం కూడా ఎక్కువవుతుంది. మేషం, సింహం, కన్య, తుల, ధనుస్సు, మీన రాశుల వారి జీవితాల్లో ఓ 15 రోజుల పాటు వసూళ్లే తప్ప చెల్లింపులకు అవకాశం ఉండకపోవచ్చు.
- మేషం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో ఈ రెండు శుభ గ్రహాలు వక్రిస్తున్నందువల్ల ఆదాయం పెరుగుతున్న కొద్దీ ఖర్చులు తగ్గడం మొదలవుతుంది. రావలసిన సొమ్మును, బాకీలను, బకాయిలను రాబట్టుకోవడం ప్రారంభమవుతుంది. అనవసర ఖర్చులకే కాక, అవసర ఖర్చులకు కూడా కోత పడుతుంది. లాభదాయక వ్యవహారాల మీద శ్రద్ధ పెరుగుతుంది. నష్టదాయక వ్యవహారాలకు స్వస్తి పలుకుతారు. వ్యసనాలు, విలాసాలు, అనవసర పరిచయాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.
- సింహం: ఈ రాశివారికి ఈ శుక్ర, బుధుల వక్రత వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల ఊహించని ధన లాభం కలుగుతుంది. రావలసిన సొమ్మంతా చేతికి అందు తుంది. బాకీలు, బకాయిలను రాబట్టుకుంటారు. అయితే, ఆర్థిక విషయాల్లో గుంభనంగా ఉండడం, ఖర్చులు తగ్గించడం, బాగా అవసరమైతే తప్ప డబ్బు బయటకి తీయకపోవడం వంటివి ఎక్కువగా జరుగుతాయి. ఖర్చుల విషయంలో ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోవడం జరుగుతుంది.
- కన్య: రాశినాథుడైన బుధుడు సప్తమ స్థానంలో శుక్రుడితో కలిసి వక్రించడం వల్ల ఆర్థిక వ్యవహారాల్లో ముందు చూపు ఎక్కువవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆచితూచి అడుగువేయడం, డబ్బును మదుపు చేయడం తప్ప ఖర్చు చేయకపోవడం వంటివి అలవడతాయి. ప్రతి విషయంలోనూ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం జరుగుతుంది. ఇతరుల మీద ఖర్చు చేయడం, ఇతరులకు సహాయం చేయడం వంటివి ఆగిపోతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ ను పెంచుకోవడమే లక్ష్యంగా మారుతుంది.
- తుల: ఆరవ స్థానంలో రాశినాథుడు శుక్రుడితో పాటు బుధుడు కూడా వక్రించడం వల్ల ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకోవడం మీద పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకృతమవుతుంది. ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చుల్ని తగ్గించుకోవడం జరుగుతుంది. ఉచిత సహాయాలు, వృథా ఖర్చులు, విలాసాలు, ప్రయాణాలకు విరామం ప్రకటించడం జరుగుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేసే అవకాశం ఉండకపోవచ్చు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడం మీద శ్రద్ధ పెరుగుతుంది.
- ధనుస్సు: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర, బుధులు వక్రించడం వల్ల ఆదాయ మార్గాల మీదా, అదనపు ఆదాయం మీదా శ్రద్ధ బాగా పెరుగుతుంది. అనవసర ఖర్చులు, విలాసాలు, వ్యసనాలకు దాదాపు పూర్తిగా స్వస్తి చెప్పి, నిరాడంబర జీవితానికి అలవాటు పడే అవకాశం ఉంటుంది. ఆస్తిపాస్తులకు సంబంధించిన వివాదాలను రాజీమార్గంలో పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉంటారు. షేర్లు, స్పెక్యులేషన్లలో ఎక్కువగా మదుపు చేసే అవకాశం ఉంది.
- మీనం: ఈ రాశిలో నీచ బుధుడు, ఉచ్ఛ శుక్రుడు వక్రించినందువల్ల జీవన శైలి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ, ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగువేయడం, ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనినీ ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కుటుంబ ఖర్చులు, వినోదాలపై ఖర్చులు బాగా తగ్గిపోతాయి. మదుపులు ఎక్కువవుతాయి.