
మన దేశంలో ఎక్కువ మంది నాన్‌వెజ్ తింటారు. చాలా తక్కువ మంది మాత్రమే నాన్ వెజ్‌కు దూరంగా ఉంటూ.. శాఖాహారం మాత్రం తింటారు. కేవలం వెజ్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నమ్మేవాళ్లు, అలాగే కొన్ని మతపరమైన అంశాలతో కూడా కొంతమంది వెజ్ మాత్రమే తింటూ ఉంటారు. అయితే.. నాన్ వెజ్‌ను ఓ నగరం పూర్తిగా నిషేధించింది. ఈ నగరంలో నాన్ వెజ్ క్రయవిక్రయాలు కూడా జరగవు. ఇలా నాన్ వెజ్‌ను పూర్తిగా నిషేధించిన తొలి నగరంగా చరిత్ర సృష్టించింది. ఈ నగర మరెక్కడో కాదు.. మనదేశంలోనే ఉంది. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలోని పాలిటానా నగరం, మాంసాహారం అమ్మకం, వినియోగాన్ని నిషేధించిన ప్రపంచంలోనే మొట్టమొదటి నగరంగా చరిత్ర సృష్టించిందని నివేదికలు చెబుతున్నాయి.
ఈ ప్రాంతంలో గణనీయమైన సాంస్కృతిక, మతపరమైన మార్పును సూచిస్తుంది, ఇది జైనమతం, దాని సూత్రాల బలమైన ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. పాలిటానాలో మాంసం కోసం జంతువులను వధించడం కూడా నిషేధించారు. నగరంలో సుమారు 250 కబేళాలను మూసివేయాలని డిమాండ్ చేస్తూ దాదాపు 200 మంది జైన సన్యాసులు నిరంతర నిరసనలు చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. పాలిటానా కేవలం ఒక నగరం మాత్రమే కాదు, ఇది జైనులకు అత్యంత పవిత్రమైన యాత్రా స్థలాలలో ఒకటి. దీనికి “జైన్ టెంపుల్ టౌన్” అనే మారుపేరు వచ్చింది. శత్రుంజయ కొండల చుట్టూ ఉన్న ఈ నగరం 800 కి పైగా దేవాలయాలకు నిలయంగా ఉంది, వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది ఆదినాథ్ ఆలయం.
ఈ దేవాలయానికి ఏటా వేలాది మంది భక్తులను, పర్యాటకులు వస్తుంటారు. పాలిటానా తర్వాత రాజ్‌కోట్, వడోదర, జునాగఢ్, అహ్మదాబాద్‌తో సహా గుజరాత్‌లోని ఇతర నగరాలు ఇలాంటి నిబంధనలను అమలు చేశాయి. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఈ నిబంధనలకు మద్దతు ఇచ్చారు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో మాంసం దుకాణాల సమూహంగా ఏర్పడటం వల్ల కలిగే ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కూడా ఈ నిబంధనల లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. పాలిటానా, గుజరాత్‌లోని ఇతర నగరాల్లో మాంసాహార ఆహారాన్ని నిషేధించాలనే నిర్ణయం ఒక చారిత్రాత్మక మైలురాయిగా చెప్పుకోవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.