
ప్రేమ పేరుతో ఓ యువకుడు యువతిని దారుణంగా మోసం చేశాడు. అతను చేసిన పనికి తల్లీకూతుర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. మండ్య తాలూకాలోని హెబ్బకవాడి గ్రామానికి చెందిన విజయలక్ష్మి ఇటీవలే డిగ్రీ పూర్తి చేసి మండ్యలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఈ క్రమంలో తనకు మారసింగనహళ్లి గ్రామానికి చెందిన హరికృష్ణతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ఏడాదిన్నర కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఏర్పడింది. కానీ, ఈలోగా హరికృష్ణకు వేరే అమ్మాయిలతో పరిచయం ఉందని తెలిసింది.
విజయలక్ష్మి దీనిని ప్రశ్నించి పెళ్లికి పట్టుబట్టింది. కానీ హరికృష్ణ మాత్రం పెళ్లి చేసుకోనని చెప్పి, ముఖం చాటేశాడు. దీంతో మనస్తాపం చెందిన విజయలక్ష్మి ఫిబ్రవరి 21న మండ్యలో రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకుంది. విజయలక్ష్మి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో పాపం.. ఆమె కుటుంబ సభ్యులకు మొదట్లో అసలు నిజం తెలియదు. కానీ తరువాత, ఆ యువతి మొబైల్ ఫోన్ చెక్ చేయడంతో ఆమె హరికృష్ణ చేతుల్లో మోసపోయిందనే నిజం వెలుగులోకి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు మాండ్య గ్రామీణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హరికృష్ణ ఇంటికి వెళ్లి ఆందోళన చేపట్టారు.
ఈ క్రమంలో పోలీసులు విజయలక్ష్మి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. దీంతో మృతురాలు విజయలక్ష్మి తల్లి లక్ష్మి చాలా బాధపడ్డారు. కూతురి మరణానికి న్యాయం జరగలేదు. విజయలక్ష్మి తల్లి లక్ష్మి కూడా డెత్ నోట్ రాసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసి, మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అనుమతించలేదు. అప్రమత్తమైన పోలీసులు చివరకు హరికృష్ణ, అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి, ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. కానీ హరికృష్ణ తప్పించుకున్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.