

ఏదైనా ఒక అలవాటు మానుకోవడం కష్టంగా మారితే దానిని ‘వ్యసనం’ అంటారు. అలాంటిదే పొగాకు వ్యసనం. ప్రపంచవ్యాప్తంగా చాలా మందిని ఇది ప్రభావితం చేస్తుంది. ఎంత ప్రయత్నించినా ఆ వ్యసనం నుంచి బయటపడలేరు. ఈ చెడు అలవాటు మానేయడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. పొగాకు, బీడీ, సిగరెట్లు తాగే ప్రతి ఒక్కరికీ ఈ అలవాటు హానికరమని తెలుసు. అయినప్పటికీ తమ స్మోకింగ్ వ్యసనాన్ని మానుకోవడం వీరికి అసాధ్యంగా మారుతుంది. WHO ప్రకారం ప్రతి యేట 70 లక్షలకు పైగా పొగాకు వాడకం వల్ల మరణిస్తున్నారు. అంతేకాకుండా యేటా దాదాపు 1.2 మిలియన్ల మంది సిగరెట్లు తాగడం వల్ల మరణిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం పొగాకు వల్ల ఆరోగ్యానికి కలిగే హాని. ప్రాణాంతకమం అని తెలిసినా ఈ వ్యసనం నుంచి బయటపడేందుకు అధిక మంది ఇష్టపడరు. పొగాకులోని నికోటిన్ అనేది శరీరంలో అనేక రకాల వ్యాధులకు కారణమయ్యే హానికరమైన రసాయనం. ఇది ‘ఊపిరితిత్తుల క్యాన్సర్’ మూత్రాశయం, కాలేయం, మూత్రపిండాలు, క్లోమం, పేగు, కడుపు వంటి అనేక రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, స్ట్రోక్తో సహా గుండెపోటు వంటి వాటిని కూడా పెంచుతుంది. కాబట్టి, ఒకేసారి ఈ అలవాటును వదిలించుకోలేకపోయినా క్రమంగా దాని వాడకాన్ని తగ్గించుకోవడం మంచిది.
ధూమపానం మానేయడానికి సులభమైన మార్గాలు ఇవే..
- సాధారణంగా, మనం తీసుకునే ఏ నిర్ణయంపై మనకు ముందు నమ్మకం ఉండాలి. ముందుకి వేసిన అడుగు వెనక్కి తీసుకోకూడదు. కాబట్టి ధూమపానం మానేయాలనే మీ ఉద్దేశ్యాన్ని పదే పదే మార్చుకోకండి. దాని గురించి ఎక్కువగా చింతించకూడదు. మీకు ఇష్టమైన పని చేయడం ద్వారా అంటే మంచి సంగీతం వినడం ద్వారా లేదా స్నేహితులతో చాట్ చేయడం ద్వారా సిగరెట్ అలవాటు క్రమంగా మానవచ్చు.
- వైద్యుని సలహా మేరకు నికోటిన్ నివారణకు మందులను తీసుకోవాలి. ఇవి ధూమపానం అలవాటును మానుకోవడానికి మీకు సహాయపడతాయి. అయితే నిపుణుల సలహా లేకుండా మందులు తీసుకోవడం హానికరమని గుర్తుంచుకోండి.
- మీరు ధూమపానం హఠాత్తుగా మానేస్తే.. తలనొప్పి, చెడు మానసిక స్థితికి కారణమవుతుంది. కానీ నికోటిన్ గమ్, లాజెంజ్లను వినియోగిస్తే దీని ప్రభావం నుంచి బయటపడొచ్చు.
- ధూమపానం మానేయడానికి ప్రయత్నిస్తున్నారనే విషయాన్ని మీ స్నేహితులతో, సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోవాలి. అంతేకాకుండా వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి.
- సిగరెట్లకు బదులుగా మౌత్ ఫ్రెషనర్ వాడాలి. దీన్ని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. పొగాకు తాగాలనే కోరిక కలిగిన ప్రతీసారి మౌత్ ఫ్రెషనర్ వాడితే కోరికను చంపేస్తుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం వైద్యుడిని సంప్రదించడం మంచిది.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.