
మూవీ రివ్యూ: కోర్ట్
నటీనటులు: ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి అప్పల, శివాజీ, రోహిణి, శుభలేఖ సుధాకర్ తదితరులు
సంగీతం: విజయ్ బుల్గానిన్
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
సినిమాటోగ్రాఫర్: దినేష్ పురుషోత్తమన్
నిర్మాతలు: ప్రశాంతి త్రిపురనేని
సమర్పణ: నాని
దర్శకత్వం: రామ్ జగదీష్
నాని నిర్మాణంలో ఒక సినిమా వస్తుంది అంటే దానిపై అంచనాలు బాగానే ఉంటాయి. హీరోగానే కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే నాని నిర్మాతగా మారి సినిమా చేశాడంటే.. అందులో కచ్చితంగా కథ ఇంకా అద్భుతంగా ఉంటుంది అనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించాడు నాచురల్ స్టార్. తాజాగా ఈయన నిర్మాణంలో వచ్చిన సినిమా కోర్ట్. మీడియాకు రెండు రోజుల ముందే స్పెషల్ ప్రీమియర్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది.. నాని నమ్మకాన్ని నిలబెట్టిందా లేదా అనేది చూద్దాం..!
కథ:
వైజాగ్ లోనే ఒక చిన్న కాలనీలో వాచ్మెన్ కొడుకు చంద్రశేఖర్ అలియాస్ చందు (హర్ష రోషన్). ఇంటర్లోనే చదువు ఆపేసి చిన్న చిన్న పనులు చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటాడు. అలాంటి వాడి లైఫ్ లోకి అనుకోకుండా జాబిలి (శ్రీదేవి) వస్తుంది. ఫోన్లో మాట్లాడుతూ కనిపించకుండా ఆట పట్టిస్తుంది. చందు వ్యక్తిత్వం నచ్చి అతనితో ప్రేమలో పడుతుంది జాబిలి. ఇక ప్రాణం కంటే పరువు ముఖ్యంగా బ్రతికే జాబిల్లి బాబాయ్ మంగపతి (శివాజీ)కి ఈ విషయం తెలుస్తుంది. దాంతో తనకు బాగా తెలిసిన లాయర్ దాము (హర్షవర్ధన్) సాయంతో ఆ కుర్రాడిపై ఉన్నవి లేని సెక్షన్లు బనాయించి అరెస్టు చేయించి జైల్లో పెడతారు. ఫోక్సో చట్టం కూడా యాడ్ చేస్తారు. దాంతో ఆ కేసు వాదించడానికి ఎవరు రారు. అలాంటి సమయంలో ఆ కేస్ టేకప్ చేయడానికి సూర్య తేజ (ప్రియదర్శి) వస్తాడు. ముందు ఆ కేసులోని అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత రంగంలోకి దిగుతాడు. చందును ఆ కేసు నుంచి సూర్యతేజ ఎలా బయటికి తీసుకొస్తాడు అనేది మిగిలిన కథ..
కథనం:
సినిమాను సినిమాలా కాకుండా ఒక కొత్త పాయింట్ చెప్పాలి అని ట్రై చేసిన ప్రతిసారి దర్శకులు సక్సెస్ అవుతూనే ఉంటారు. తమ సినిమా నుంచి జనాలకు ఎంతో కొంత అవగాహన కల్పించాలని అనుకునే దర్శకులు అరుదుగా ఉంటారు. తాజాగా కోర్టు సినిమా విషయంలో కూడా దర్శకుడు రామ్ జగదీష్ ఇదే చేశాడు. తన సినిమాతో న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని లొసుగులను కొంతమంది ఎలా తప్పుదారి పట్టిస్తున్నారు అనేది అద్భుతంగా చూపించాడు. నిజానికి కోర్టు రూమ్ డ్రామాలకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అక్కడ వాదన ఎంత బాగా జరిగితే.. సినిమా అంత ఆసక్తికరంగా ఉంటుంది. కోర్టు సినిమాకు కూడా ఈ అడ్వాంటేజ్ బాగా పనికొచ్చింది. తాను చెప్పాలనుకున్న పాయింట్ డివియేట్ కాకుండా సూటిగా చెప్పాడు దర్శకుడు రామ్ జగదీష్. ఫోక్సో చట్టం గురించి చాలా మందికి ఐడియా ఉండదు. అసలు అలాంటి ఒక చట్టం ఉందనే విషయం కూడా చాలా మందికి తెలియకపోవచ్చు. దాన్ని నేపథ్యంగా చేసుకున్నప్పుడే కోర్టు సినిమా విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. దాని చుట్టూ ఒక సింపుల్ కథ అల్లుకున్నాడు. ఒక యంగ్ లవ్ స్టోరీ చూపించాలి అనుకున్నప్పుడు కొన్ని రిస్కులు తీసుకోవాల్సి వస్తుంది.. కానీ సినిమాలో ఎలాంటి అసభ్యత లేకుండా చాలా క్లీన్ గా తెరకెక్కించాడు రామ్ జగదీష్. క్లైమాక్స్ లో చూపించే ట్విస్ట్ కూడా హీరో హీరోయిన్ అమాయకత్వానికి పరాకాష్టలా ఉంటుంది. కానీ సినిమాలో ఎమోషనల్ సీన్ కూడా అదే. ఎందుకంటే ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగిన అన్ని వేళ్ళు దర్శకుడి వైపు చూపిస్తాయి. తన వైపు నుంచి ఆ తప్పు జరగకుండా జాగ్రత్తగా స్క్రిప్ట్ రాసుకున్నాడు దర్శకుడు రామ్ జగదీష్. ఫస్ట్ ఆఫ్ అంతా హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్.. పరువే ప్రాణంగా బ్రతికే ఇంటి పెద్దకు విషయం తెలియడం.. ఆ కుర్రాడిపై లేనిపోని కేసులు పెట్టి జైలుకు పంపించడం.. ఇవన్నీ చకచకా జరిగిపోతాయి.
అసలు కథ మొత్తం ప్రియదర్శి కేసు టేకప్ చేసిన దగ్గర నుంచి నుంచి మొదలవుతుంది. సెకండ్ హాఫ్ అంతా వాదనలు, ప్రతివాదనలు, ట్విస్ట్ లతో ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిపోతుంది. ఎక్కడా మనం ఊహించని మలుపులు అయితే ఉండవు కానీ.. మనం ఊహించినప్పుడు మాత్రం ఆ మలుపులు రావు. కోర్టు సినిమా చూస్తున్నప్పుడు అదే అనిపించింది. కథ మనం అనుకున్నట్టుగానే ముందుకు సాగుతుంది కానీ కథనం మాత్రం అలా కాదు. కథ ఎంత సున్నితంగా ఉందో.. ఎమోషన్స్ అంత బలంగా ఉన్నాయి. కోర్టు డ్రామా అంతా బాగా వర్కవుట్ అయింది. క్లైమాక్స్ కూడా చాలా బాగా రాసుకున్నాడు దర్శకుడు. మరీ ముఖ్యంగా ఇలాంటి కథలో ఎలాంటి అసభ్యత లేకుండా చూసుకున్నాడు. క్లైమాక్స్ లో న్యాయ వ్యవస్థను ప్రశ్నించాడు కూడా.
నటీనటులు:
ప్రియదర్శి నటన గురించి కొత్తగా ఏం చెప్పాలి.. ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఎప్పుడు వచ్చినా చాలా బాగా నటించి చూపిస్తాడు దర్శి. కోర్టులో లాయరుగా అదరగొట్టాడు. బాల నటుడిగా ఇప్పటికే చాలా సినిమాల్లో మెప్పించిన హర్ష రోషన్ ఈ సినిమాలో చందు పాత్రలో చాలా మెచ్యూర్డ్ గా నటించాడు. కొత్తమ్మాయి శ్రీదేవి బాగుంది.. నటన కూడా ఆకట్టుకుంటుంది.
సాయి కుమార్ కనిపించేది కొన్ని సీన్స్ అయినా కూడా చాలా ఇంపాక్ట్ ఉంది. ఈ సినిమాలో ఎంతమంది ఉన్నా ఈ సినిమాను నిలబెట్టింది శివాజీ.. ఆయన నటన నెక్స్ట్ లెవెల్. తనలోని సరికొత్త విలనిజం చూపించాడు శివాజీ. రోహిణి, శుభలేఖ సుధాకర్ లాంటి వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ టీం:
ఈ సినిమాకు మెయిన్ హైలెట్ బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం. ప్రేమలో సాంగ్ ఇప్పటికే బాగా పాపులర్ అయింది.. సినిమాలో ఉన్న మిగిలిన రెండు పాటలు కూడా ఆకట్టుకున్నాయి. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నాని తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు కొత్త దర్శకుడు రామ్ జగదీష్. నాని నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
పంచ్ లైన్:
ఓవరాల్ కోర్ట్.. వెరీ ఇంట్రెస్టింగ్ కోర్టు డ్రామా..!