దేశ వ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీ కర్తవ్యపథ్‌లో స్వర్ణిమ్ భారత్, విరాసత్ ఔర్ వికాస్ థీమ్‌తో ఈ ఏడాది రిపబ్లిక్‌డే వేడుకలు నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఉదయం పదిన్నరకు రిపబ్లిక్‌డే పరేడ్ విజయ్ చౌక్ నుంచి ప్రారంభమై.. కర్తవ్య పథ్ మీదుగా ఎర్రకోటకు చేరుకుంటుంది. ఈ పరేడ్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలకు చెందిన 15 శకటాలు పాల్గొంటాయి. కవాతు సందర్భంగా సుమారు 5 వేలమంది కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. మహాకుంభ్ ప్రాముఖ్యతను తెలియజేసే శకటం ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణ. ఇక త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం ఈ సారి ప్రత్యేకత. నింగి, నేల, సముద్రంపై జరిగే యుద్ధ దృశ్యాలతో ఈ శకటాన్ని తీర్చిదిద్దారు.
రిపబ్లిక్‌డే వేడుకల సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. ప్రధాన వేదిక సమీపంలో యాంటీ-డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆర్మీ హెలికాప్టర్లు ఇప్పటికే గస్తీ నిర్వహిస్తున్నాయి. IAFకు చెందిన 40 యుద్ధ విమానాలు, తీరరక్షక దళంలోని 3 డోర్నియర్ విమానాలు ఆకాశంలో విన్యాసాలతో వైమానిక దళ పాటవాన్ని ప్రదర్శించనున్నాయి.
DRDO అభివృద్ధి చేసిన.. ‘ప్రళయ్’ బాలిస్టిక్ క్షిపణిని తొలిసారి గణతంత్ర పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. 150 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను.. ఈజీగా అత్యంత కచ్చితత్వంతో ఈ క్షిపణి ఛేజ్ చేయగలదు. మొబైల్ లాంచర్లతోనూ ఈ మిస్సైల్ ప్రయోగించొచ్చు.
జాతీయ జెండాను ఆవిష్కరించనున్న రాష్ట్రపతి..
గణతంత్ర దినోత్సవ వేడుకలు కర్తవ్య పథ్ వద్ద ఘనంగా జరుగుతాయి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద అమరవీరులకు నివాళులర్పిస్తారు.
రిపబ్లిక్ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు..
ఈసారి రిపబ్లిక్ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఇండోనేసియా అధ్యక్షుడికి ఘన స్వాగతం లభించింది. ఇండోనేషియాకు చెందిన 352 మంది సభ్యుల మార్చింగ్, బ్యాండ్ బృందం తొలిసారి గణతంత్ర దినోత్సవ కవాతులో పాల్గొంటొంది.
