
పొరపాటున కూడా మర్చిపోరాని తెలుగింటి స్వీట్స్‌లో బెల్లం గవ్వలు ఒకటి. ఒకప్పుడు ఇంట్లో తప్పనిసరిగా చేసుకునే ఈ తీపి వంటకం.. ఇప్పుడు పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ మధ్య మరిచిపోయిన స్థితికి చేరింది. కానీ బెల్లం గవ్వలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇందులో బెల్లం, గోధుమపిండి ఉండటంతో ఆరోగ్యానికి హాని కలిగించే రసాయన పదార్థాలు ఉండవు. పిల్లలు ఆరోగ్యంగా ఉండటానికి రుచి పాటించేందుకు ఈ స్వీట్ బెస్ట్ ఆప్షన్. ఈ వంటకం ఎలా తయారు చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా..? క్రిస్పీగా, మృదువుగా ఉండేలా బెల్లం గవ్వలు చేసుకునే విధానం ఇప్పుడు మీకోసం.
కావాల్సిన పదార్థాలు
- గోధుమపిండి – 1 ½ కప్పు
- నెయ్యి – 2 స్పూన్లు
- ఉప్పు – ½ స్పూను
- వంట సోడా – ¼ స్పూను
- నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
- బెల్లం – ¾ కప్పు
తయారీ విధానం
ఓ పెద్ద గిన్నెలో గోధుమపిండి, నెయ్యి, ఉప్పు, వంట సోడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా కలపాలి. పిండి మృదువుగా ఉండేలా చూసుకోవాలి. దీనిని మెత్తగా కలిపి 10 నిమిషాలు మూతపెట్టి పక్కకు పెట్టుకోవాలి.
ఇప్పుడు ఆ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఒక్కో ముద్దను గవ్వ ఆకారంలో మెల్లగా ఒత్తాలి. కొంతమంది ప్రత్యేకమైన గవ్వ పీట ఉపయోగిస్తారు. అది లేనివారు చేత్తోనే ఆకారం చేస్తుంటారు.
స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి. నూనె బాగా వేడెక్కాక సిద్ధం చేసుకున్న గవ్వలను అందులో వేయించాలి. అవి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
మరో గిన్నెలో బెల్లం తీసుకుని అందులో అరకప్పు నీళ్లు పోసి మరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగి తీగపాకం వచ్చే వరకు వేడి చేయాలి. దీని కోసం బెల్లాన్ని వేళ్ల మధ్య తీసుకుని చూడాలి. తీగలా వస్తే పాకం సిద్ధం అయినట్టు. బెల్లం తీగపాకం వచ్చిన తర్వాత ముందుగా వేయించుకున్న గవ్వలను అందులో వేసి బాగా కలపాలి. అన్నీ గవ్వలూ బెల్లం పాకం పట్టేలా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత, గవ్వలు ఒకదానికొకటి అతుక్కుంటాయి. వాటిని మెల్లగా వేరు చేసుకోవాలి. గాలి చొరబడని కంటైనర్‌లో స్టోర్ చేయాలి. ఇలా చేస్తే మూడు వారాల వరకు తాజాగా ఉంటాయి.
ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి ఫ్రిజ్‌లో ఉంచాల్సిన అవసరం ఉండదు. అంతే కాదు బెల్లం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. పిల్లలకు పోషక విలువలతో కూడిన స్వీట్ కావాలంటే, మైదా పిండికి బదులుగా గోధుమపిండితోనే చేయడం ఉత్తమం.