తెలుగులో హార్ట్ బ్రేక్, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్‌కి ఎప్పుడూ మంచి రీచ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఓ ఫెయిల్యూర్ సాంగ్స్ ఉంటాయి కాబట్టి ఈ సాంగ్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. సినిమాలోని లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ మాత్రమే కాదు ప్రవేట్‌గా చేసే ఇలాంటి ఫోక్ సాంగ్స్, కవర్ సాంగ్స్ కూడా జనాల్లోకి బాగా వెళ్తాయి. అయితే మీ దృష్టిలో నైంన్టీస్ కిడ్స్ను అల్లాడించిన బ్రేకప్ సాంగ్ ఏంటో చెప్పగలరా..?. అయితే మెజార్టీ వర్గాల నుంచి వస్తున్న అభిప్రాయం మాత్రం అనితా ఓ అనితా సాంగ్. ఈ పాట అప్పట్లో సంచలనం సృష్టించింది. జనాలు ఈ పాటలోని లిరిక్స్‌కు.. అందులోని బాధకు క్లీన్ బౌల్డ్ అయ్యారు. ఇప్పటికీ ఈ పాట ప్లే చేస్తే.. నైంన్టీస్ కిడ్స్ ఓ రేంజ్లో వైబ్ అవుతారు. తమను వదిలి వెళ్లిన.. దూరమైన ఎక్స్‌లను తలచుకుంటూ ఎమోషనల్ అవుతారు. ఈ పాట 2008లో వచ్చింది. గుణిపర్తి నాగరాజు అనే జానపద రైటర్, సింగర్.. ఈ పాట రాసి ఆలపించారు. ఈ పాటకు యూట్యూబ్‌లో 112 మిలియన్ల వ్యూస్ ఉన్నాయి. ఇంకా అనేక వీడియోలు కూడా ఇదే పాటతో అప్ లోడ్ అయ్యాయి. అవి అన్నీ కూడా ఓ 50 మిలియన్ల వరకు ఉంటాయి.
లక్షలాది మంది యువత మనసులను గెలుచుకున్న “అనిత ఓ అనిత” పాట వెనుక ఉన్న అసలు కథ వెనుక ప్రయాణం గురించి నాగరాజు ఓ ఇంటర్వ్యూలో ఆయన అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పాట విడుదలైన తర్వాత, దాని విజయంతో పాటు అనేక అపోహలు, పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి. ఆ పాట పాడిన అబ్బాయి, అమ్మాయి చనిపోయారని.. అతను ఎస్సై బిడ్డను ప్రేమించి పోలీసులు కొట్టడం వల్ల ఈ పాట పుట్టిందని చాలా మంది నమ్మారని గాయకుడు వెల్లడించారు. అయితే, వీటన్నింటినీ ఆయన ఖండించారు. ఒక లవ్ సాంగ్ వీడియోలో హీరో చనిపోయే సన్నివేశానికి తన “అనిత” పాట ఆడియోను కలిపి ప్రచారం చేయడం వల్ల ఈ గందరగోళం మొదలైందని వివరించారు. ఇదంతా “మౌత్ టాక్” వల్ల జరిగిందని, ఆ పుకార్లే తన పాటను ఎక్కువ మందికి చేర్చాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ పాట పుట్టుక గురించి చెబుతూ, అది తన కాలేజీ రోజుల్లో రాసిన పాట అని, తాను ప్రేమించిన అమ్మాయి అనిత పేరు మీదే ఈ పాటను స్వరపరిచానని అన్నారు. మొదట వారిద్దరి మధ్య టూ-సైడ్ లవ్ ఉందని, అయితే ఆ అమ్మాయి దూరం కావడం వల్ల కలిగిన బాధ నుంచి ఈ పాట పుట్టిందని చెప్పారు. ఆ అమ్మాయికి కృతజ్ఞతలు చెప్పాలని, ఆమె లేకపోతే తనకు ఇంత పేరు వచ్చేది కాదని ఆయన అన్నారు. ప్రస్తుతం తాను, అనిత ఇద్దరూ వేర్వేరుగా వివాహం చేసుకున్నామని తెలిపారు. ఒకవేళ తన పాట వల్ల అనితకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమాపణలు కోరారు. “అనిత ఓ అనిత” పాట తెలుగు ఫోక్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిందని గాయకుడు పేర్కొన్నారు. అప్పటివరకు వేరే క్లాసిక్ అమ్మాయిల పేర్ల మీద మాత్రమే పాటలు వచ్చేవని, అనిత పాటతో లవ్ సాంగ్స్‌కు కొత్త ఒరవడి మొదలైందని అన్నారు.
తన పాట విడుదలైన దాదాపు ఒకటిన్నర సంవత్సరం తర్వాత.. ఓ టీవీ ఛానల్ తనను పాల్వంచలో (అక్కడ ఆయన అప్పట్లో MBA చదువుతున్నారు) కనుగొని, ఛానల్‌కు ఆహ్వానించారని వివరించారు. అలా తన ఫేస్ జనాలకు నోటెడ్ అయిందని చెప్పుకొచ్చారు. నాగరాజు కుటుంబ నేపథ్యం సంగీతంతో నిండినప్పటికీ, ఆయనకు అధికారికంగా సంగీత శిక్షణ లేదు. ఆయన తండ్రి, తల్లి, తమ్ముడు, చెల్లి అందరూ గాయకులే కావడంతో, ఇంట్లోనే ఆయనకు సంగీతంపై ఆసక్తి ఏర్పడింది. నాగరాజు అనేక ఇతర పాటలు కూడా రాశారు, ప్రేమ ప్రయాణం వంటి సినిమాలకు గీతాలు అందించారు. హన్మకొండలోని భిక్షపతి రికార్డింగ్ స్టూడియో, హసన్ పర్తి భరత్ స్టూడియోలలో పని చేసిన తరువాత, విస్తృత అవకాశాల కోసం ఇటీవల హైదరాబాద్‌కు మారారు. కూకట్‌పల్లిలో ఉంటూ తన సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.
Also Read: అభిమానులను మోసం చేశావ్ ఉదయ్ కిరణ్.. ఫీనిక్స్ పక్షిలా లేచి వస్తానని చెప్పి..
