Pakistan vs Australia T20 Series 2026: Full Schedule, Venue and Match Timings: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త. టీ20 వరల్డ్ కప్ 2026 ఆరంభానికి కేవలం కొద్ది రోజుల ముందు పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న మెగా టోర్నీకి సన్నద్ధం కావడానికి ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఇరు జట్లకు కీలకం కానుంది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఈ సిరీస్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను తాజాగా విడుదల చేసింది.
లాహోర్ వేదికగా పోరు..
ఈ మూడు టీ20 మ్యాచ్‌లు కూడా లాహోర్‌లోని చారిత్రాత్మక గడ్డాఫీ స్టేడియంలోనే జరగనున్నాయి. ఆస్ట్రేలియా జట్టు జనవరి 28న పాకిస్థాన్‌కు చేరుకుంటుంది.
సిరీస్ షెడ్యూల్ (భారత కాలమానం ప్రకారం):
మొదటి టీ20: జనవరి 29, సాయంత్రం 6:30 గంటలకు
రెండో టీ20: జనవరి 31, సాయంత్రం 6:30 గంటలకు
మూడో టీ20: ఫిబ్రవరి 1, సాయంత్రం 6:30 గంటలకు
వరల్డ్ కప్ సన్నాహకాలే లక్ష్యం..
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ గ్రూప్-Aలో ఉండగా, ఆస్ట్రేలియా గ్రూప్-Bలో ఉంది. ఈ మెగా టోర్నీకి ముందు తమ జట్లలోని లోపాలను సరిదిద్దుకోవడానికి, ప్లేయింగ్ ఎలెవన్‌ను ఖరారు చేసుకోవడానికి ఈ సిరీస్ ఒక మంచి వేదిక. ముఖ్యంగా పాక్ గడ్డపై ఉపఖండ పరిస్థితులలో ఆడటం ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ (భారత్, శ్రీలంక) తయారీకి ఎంతో ఉపయోగపడుతుంది.
గాయాల బెడద, జట్టు ఎంపిక..
ప్రస్తుతం రెండు జట్లను గాయాలు వేధిస్తున్నాయి. ఆస్ట్రేలియా స్టార్ బౌలర్లు పాట్ కమిన్స్, జోష్ హాజిల్‌వుడ్ కోలుకుంటుండగా, పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ షహీన్ షా అఫ్రిది గాయం కారణంగా ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ సిరీస్ నాటికి వీరందరూ తిరిగి వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, పాక్ జట్టులో బాబర్ ఆజం, రిజ్వాన్ భవిష్యత్తుపై కూడా చర్చ నడుస్తోంది.
అభిమానులకు పండుగే..!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సీఓఓ సుమైర్ అహ్మద్ సయ్యద్ మాట్లాడుతూ, “ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టుకు ఆతిథ్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. వరల్డ్ కప్ ముందు ఈ సిరీస్ అభిమానులకు భారీ వినోదాన్ని పంచుతుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు. 2022 తర్వాత ఆస్ట్రేలియా పాకిస్థాన్‌లో పర్యటించడం ఇది మూడోసారి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
