
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చేసింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు ఇప్పుడు ఖాళీ అవుతున్నాయి. అయినా ఇప్పుడున్న సంఖ్య ప్రకారం బిఆర్ఎస్ పార్టీకి వచ్చేది ఒక ఎమ్మెల్సీ స్థానం మాత్రమే. ప్రతిపక్ష పార్టీకి పదవులు రావడం చాలా రేర్. అలాంటప్పుడు వచ్చిన అవకాశాల్ని పట్టుకోవాలని పార్టీలో ప్రతి నేత ఆలోచిస్తారు. ఇప్పుడు భారత రాష్ట్ర సమితిలోనూ అదే జరుగుతోంది. 38 మంది గెలిచినా.. పదిమంది కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో 28 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం పార్టీలో ఉన్నారు. ఈ లెక్క ప్రకారం ఎమ్మెల్యే కోటాలో ఒక ఎమ్మెల్సీ గెలుచుకునే అవకాశం స్పష్టంగా ఉంది. ఖాళీ అవుతున్న నలుగురు మాజీ డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కేసీఆర్ అనుచరుడు సుభాష్ రెడ్డి, కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎగే మల్లేశం. సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ ఇద్దరు తమకు మరోసారి అవకాశం ఇస్తారని గట్టిగా నమ్ముతున్నారు.
ఇక పార్టీలో గతంలో ఎమ్మెల్సీ స్థానం ఇచ్చిన గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉండి ప్రభుత్వ మారాక ఎమ్మెల్సీ రాని దాసోజు శ్రవణ్ కూడా ఈ అవకాశాన్ని ఆశిస్తున్నారు. ఎన్నికల తర్వాత పార్టీలో చేరి ఇప్పుడు పార్టీలో కీలకంగా ఉన్న మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పోటీలో ఉన్నారు.
ఇక దీంతో పాటు మాజీ మంత్రులు, మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్సీలు ఇదే సీటు కోసం ఆశలు పెట్టుకున్నారు. మరో ఆసక్తికర విషయమేంటంటే మొన్న తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో కేసీఆర్ పిలిచి మరీ సీనియర్ జర్నలిస్టు తంకశాల అశోక్‌ను పక్కన కూర్చోబెట్టుకున్నారు. దీంతో పార్టీలో ఆయన పేరు కూడా వినిపిస్తుంది. అయితే వీటన్నిటికంటే కొద్దిరోజుల క్రితమే సత్యవతి రాథోడ్‌కు కౌన్సిల్లో పార్టీ విప్ పదవిని కట్టబెట్టారు కేసీఆర్. దీంతో మరోసారి సత్యవతి రాథోడ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని గట్టిగా టాక్ వినిపిస్తుంది. ఎమ్మెల్సీ పదవి ముగుస్తుండటంగా ఇప్పుడు విప్ పదవి ఇవ్వడం అందుకు సంకేతంగా అనుకుంటున్నారు. మొత్తంగా ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం టిఆర్ఎస్ పార్టీలో 30 మంది దాకా పోటీ పడడం కనిపిస్తుంది.