
కృష్ణా నదిలో నీళ్లు తక్కువ, దానిమీద కట్టిన ప్రాజెక్టులు ఎక్కువ. గోదావరి నదిలో నీళ్లు ఎక్కువ.. ప్రాజెక్టులు తక్కువ. అందుకే జల వివాదాలూ తక్కువే. గోదావరి విషయంలో తెలంగాణకు ఆంధ్రప్రదేశ్‌తో పెద్దగా నీళ్ల పంచాయతీ లేనే లేదు. కానీ.. కృష్ణానదితోనే వచ్చింది గొడవంతా. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కల్పించుకున్నా.. కృష్ణవేణి చెంత రాజకీయ మంటలు మాత్రం చల్లారలేదు. నీటి జాడ లేక బావులన్నీ ఎండమావులౌతుంటే బతుకులన్నీ ఎండిపోతుంటే.. వేసవి సీజన్ ముంచుకొచ్చి నడినెత్తిన కూర్చుంటానంటుంటే.. సాగు-తాగు నీళ్ల అవసరాలు గుర్తుకొచ్చి నదీజలాల వాటాలపై సీరియస్‌గా దృష్టి పెట్టాయి రెండు తెలుగు ప్రభుత్వాలు.
ఓ దొరా మా దొరా.. ఊతమియ్యరా.. అని ఏలినవాళ్లను వేడుకోవడాలే తప్ప.. బీళ్లను బంగరు చేలుగా మార్చాలన్న చిత్తశుద్ధులు అక్కడున్నట్టా లేనట్టా..? పట్టువిడుపుల ఊసే లేకుండా.. చెరోపక్క లాగుతూనే ఉన్నాయి రెండు ప్రభుత్వాలు. రాజకీయాలొద్దంటూనే రాజకీయాలు మాత్రమే చేస్తున్నాయి. పదేళ్లు దాటినా.. ప్రభుత్వాలు మారినా.. అదే లొల్లి.. ప్రతీ వేసవికీ బార్డర్లో తప్పని అలజడి. సాగూ లేదు తాగూ లేదు.. రాజకీయ రభసలే తప్ప!
రెండురాష్ట్రాల మీదుగా సాగుతున్న కృష్ణా, గోదావరి నదుల్లో నీళ్ల వాటాలు తేలక.. తెలుగురాష్ట్రాల మధ్య నిప్పులు కురుస్తూనే ఉన్నాయి. వివాదాల పరిష్కారం కోసం కెఆర్ఎంబీ, జీఆర్ఎంబీ పేర్లతో మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసినా.. అవన్నీ ఉన్నా లేనట్టు.. ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోతున్నాయి. ఎవరి రాష్ట్ర ప్రయోజనాలను వాళ్లు ఏకరూవు పెట్టుకుంటూ.. వాళ్ల వాళ్ల రాష్ట్రాల్లో ఓటు బ్యాంకులు సడలిపోకుండా అతి జాగ్రత్తపడుతూ.. చివరాఖరికి సమస్యను సమస్యగానే ఉంచేశారు.
ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద నీటి కటకట తీవ్రస్థాయిలో ఉంది. ఆరున్నర లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేసుకున్నారు. సాగర్ ఎడమకాల్వకు ఇంకా నాలుగు తడులు కావాలి. హైదరాబాద్ సహా అనేక జిల్లాల్లో తాగునీటి అవసరాలు తీరనేలేదు. దీంతో సహజంగానే కృష్ణా నదీజలాల విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పుడే కాదు.. ఖరీఫ్, రబీ సీజన్లు మొదలయ్యే వేసవికాలం వస్తుందంటే చాలు ఏటా ఇవే టెన్షన్లు. కెఆర్ఎంబీ దగ్గర పంచాయతీలతో రెండు రాష్ట్రాల మధ్య అగాధం పెరుగుతూనే ఉంది.. ఎందుకు? ఒక్కో ‘వాటర్ ఇయర్’లో 66:34 నిష్పత్తితో 512-299 టీఎంసీల చొప్పున క్రిష్ణనీళ్లను ఏపీ-తెలంగాణ రాష్ట్రాలు పంచుకోవాలి. ఇదీ విభజన తర్వాత జనాభా ప్రాతిపదికన 2015లో కుదిరిన ఒప్పందం. కాకపోతే.. ఈ డీల్ మాకు ఓకే కాదంటూ తెలంగాణ రాష్ట్రం పేచీ పెడుతూ రావడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. అప్పట్లో ఒక్క సంవత్సరం కోసం రాసుకున్న తాత్కాలిక డీల్ అది.. నిజానికి 71:29 దామాషాలో నీటి వాటాలు కేటాయించాలని వాదిస్తోంది తెలంగాణ. కనీసం ఫిఫ్టీ-ఫిఫ్టీ నిష్పత్తిలో క్రిష్ణమ్మ నీళ్లను పంచాల్సిందే అని మొండికేస్తోంది తెలంగాణ.
ఇటీవల నెలరోజుల గ్యాప్‌లో నాలుగుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసి సంప్రదింపులు జరిపినా.. పంపకాల సమస్య కొలిక్కిరాలేదు. పైగా.. కొత్త సమస్యలు ఎదురవ్వడంతో మీరూ మీరూ కూర్చుని మాట్లాడుకోండి.. న్యాయబద్ధంగా వాటాలు పంచుకోండి అంటూ చేతులెత్తేసింది KRMB. నీటివాటాలే కాదు.. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల భద్రత.. ఏపీలో ఏర్పాటు కాబోయే KRMB కార్యాలయం.. ఇలా వేటికవే ఎడతెగని సమస్యలు. అఖిలపక్షం వేసుకుందాం.. ఢిల్లీకి బండి కట్టుకుందాం.. కేఆర్ఎంబీతో కొట్లాడదాం.. అవసరమైతే మోదీ ఇంటి దగ్గరే సిట్టింగేద్దాం.. అని అపోజిషన్ పార్టీ ఎక్కితొక్కేస్తుంటే ఉక్కిరిబిక్కిరవుతోంది రేవంత్ సర్కార్. అటు.. ఏపీ చాటుమాటుగా లెక్కకు మించి నీళ్లను వాడుకుంటోందనేది తెలంగాణ మోపుతున్న మరో అభియోగం. చంద్రబాబు ప్రభుత్వం నీళ్లను తరలించుకుపోతుంటే రేవంత్‌రెడ్డి ఫిడేల్ వాయిస్తున్నారంటూ సెటైర్ల తాకిడిని పెంచింది గులాబీ దండు.
కృష్ణానదిలో నీళ్ల వాడకం లెక్క పక్కాగా తేలాలంటే టెలిమెట్రీ పరికరాలు అమర్చాలన్న డిమాండ్లు కూడా వినిపించాయి. అయినా.. తమ వాదనలను కేఆర్ఎంబీ పెడచెవిన పెడుతోందని.. ఏపీకి వత్తాసు పలుకుతోందని, పైనుంచి కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని తెలంగాణ సర్కార్ ఆరోపిస్తోంది. ఈ విధంగా బీజేపీ కూడా కార్నర్ అవుతోంది. కానీ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి నాటకాలాడుతున్నాయని, క్రిష్ణమ్మ నీళ్లను అప్పనంగా ఏపీకి సమర్పించారని రివర్స్‌లో కొడుతోంది కమలం పార్టీ. మీ రాజకీయాల్లోకి మమ్మల్ని లాగొద్దు మేస్టారూ.. అంటూ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది ఏపీ సర్కార్.
రెండు రాష్ట్రాల మధ్య ఇలా నీళ్ల లొల్లి పీక్స్‌కి చేరుకున్నా.. KRMB పెద్దలు దిక్కులు చూస్తున్నారు. ప్రతి 15 రోజులకొకసారి సమావేశమై నీటి వినియోగాన్ని సమీక్షించుకుందామంటూ.. వీళ్లను దేవుడే కాపాడాలి.. అని సణుక్కుంటూ.. ఇప్పటికింతే అని సమావేశాన్ని వాయిదా వేసి చక్కా వెళ్లిపోయారు KRMB ఛైర్మన్సారు. వీళ్లిద్దరి నీళ్ల కొట్లాటతో ఆయన తలబొప్పి కట్టడం ఇది పధ్నాలుగోసారనుకుంటా..!
విభజన చట్టం ప్రకారం.. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ నేతృత్వంలో.. ఒక స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేసి.. దానికి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అని పేరు పెట్టి.. మార్గదర్శకాలు రాసిచ్చి కూర్చుని మాట్లాడుకోండయ్యా అంటే.. ఇక్కడ ఎవరికి వారే యమునా తీరే. దీంతో.. ఏ ఏటికాయేడు కృష్ణానదీ జలాల పంపకం సంక్లిష్టంగానే మారుతూనే ఉంది. దశాబ్దం గడిచినా.. ముఖ్యమంత్రులు మారినా చిక్కుముళ్లు వీడింది లేదు.తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిందే నీళ్లు నిధులు నియామకాల కాన్సెప్ట్ మీద. ఇందులో మొదటిది నీళ్లు. విభజన జరిగితే నీటి యుద్ధాలు ఖాయమని, మనతో మనమే కొట్లాడుకుంటామని అప్పట్లో అసెంబ్లీ వేదికగా సీఎం హోదాలో కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్లు.. ఏటా వేసవి సీజన్ రాగానే రెండు రాష్ట్ర ప్రభుత్వాల చెవుల్ని ఇప్పటికీ తూట్లు పొడుస్తున్నాయి.
శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లపై పట్టు కోసం రెండు రాష్ట్రాలూ ఇప్పటికీ కయ్యమాడుతూనే ఉన్నాయి. 2023 డిసెంబర్ ఫస్ట్‌వీక్‌లో సాగర్ డ్యామ్‌పై హైపర్ టెన్షన్ సీన్లు మర్చిపోదామన్నా మర్చిపోలేం. అట్నుంచి వెయ్యిమంది, ఇట్నుంచి వెయ్యమంది పోలీసుల్నేసుకుని.. ఇరిగేషన్ అధికారులు బాహాబాహీ తలబడ్డ యాక్షన్ సీక్వెన్స్ అది. నీళ్ల వాటా విషయంలో కేసీఆర్, చంద్రబాబు, జగన్, ఇప్పుడు రేవంత్.. ఒక్కోసారి వైఎస్ఆర్ని కూడా సీన్లోకి తీసుకొచ్చి కృష్ణా జలాల వివాదాన్ని జఠిలం చేస్తూనే ఉన్నాయి పొలిటికల్ పార్టీలు. ఎన్నికలొచ్చిన ప్రతీసారీ ఇదొక ప్రచారాస్త్రంగా కూడా మారుతోంది. రాయలసీమ ఎత్తిపోతలకు తెలంగాణ ససేమిరా అంటే.. పాలమూరు, దిండి ప్రాజెక్టుల మీద ఏపీ సర్కార్ చెయ్యడ్డం పెట్టడంతో.. గతంలో కూడా కేఆర్ఎంబీ మీటింగులు హీటెక్కాయి. ఏటా వేసవిలో నీటివాటాలపై జగన్, కేసీఆర్ ప్రభుత్వాధినేతలుగా ఉన్నప్పుడూ రాజీ కుదిరింది లేదు.
2021లో కూడా కృష్ణా జలాల పంపకాలపై రెండు రాష్ట్రాల మధ్య లేఖల యుద్ధం జరిగింది. కృష్ణా జలాలను చెరి సగం పంచాలని తెలంగాణ, రెండో ట్రైబ్యునల్ ఆదేశాల మేరకే పంపకాలు జరగాలని ఏపీ.. గట్టిగా వాదించాయి. ఉమ్మడి ప్రాజెక్టుల్లో కూడా నీటి వాటాలు ప్రాజెక్టుల వారీగా జరగలేదని కేఆర్ఎంబీ దృష్టికి తీసుకెళ్లింది ఏపీ సర్కార్. శ్రీశైలం నుంచి చెన్నైకు, సాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగునీటి కోసం మాత్రమే నీళ్లను తీసుకునేందుకు వెసులుబాటు ఉందని, మిగతాదంతా పాత పద్ధతిలోనే కొనసాగించాలని కోరింది ఏపీ. నాలుగేళ్లు గడిచినా.. తెలంగాణ కోరుతున్న ఫిఫ్టీ-ఫిఫ్టీ డిమాండ్ ముందుకు జరగడం లేదు.
ఈ పీటముడి వీడిపోవాలంటే ఒక్కటే దారి. నీటి వాటాల సమస్య పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ వేసి కూర్చోబెట్టి మాట్లాడ్డం. అది కూడా జరిగింది. గత ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్ జలసౌధలో KRMB త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. కానీ.. రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు డుమ్మా కొట్టారు. KRMB ఉనికినే ప్రశ్నిస్తున్న తెలంగాణ వాదన వివాదాస్పదంగా మారుతోంది. KRMB లేకుంటే ఏపీ, తెలంగాణ మధ్య సమన్వయం ఎలా అని ప్రశ్నిస్తోంది కేంద్ర జలశక్తి శాఖ. విభజన చట్టంలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ప్రతిపాదించిందే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచే వ్యతిరేకత రావడం ఏంటి.. KRMBకి సహాయ నిరాకరణ చేయడం ఎందుకు? అని తెలంగాణ సర్కార్‌తో విభేదిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏపీ, తెలంగాణ పరస్పరం మాట్లాడుకొని.. పట్టువిడుపులకు పోతే తప్ప ఈ గొడవ సద్దుమణిగేది కాదన్నది నిజం.
నదీ జలాల వివాదాలు.. ఏ రాష్ట్రానికీ కొత్త కాదు. ఏ నదికీ లేనివీ కావు. కావేరీ, నర్మద, మహానది, పెరియార్, మహాదాయి ఇలా వివాదాల్లో చిక్కుకున్న నదుల జాబితా చాంతాడంత. ఆ సీక్వెన్స్‌లో తెలుగు రాష్ట్రాల నీటివాటాల గొడవ చాలా ప్రత్యేకం. రెండు రాష్ట్రాలకూ జీవనాధారమైన కృష్ణ, గోదావరి జలాల వివాదం కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖకు పెద్ద సమస్యలా మారింది. ముఖ్యంగా క్రిష్ణవేణమ్మ దాయాది రాష్ట్రాల మధ్య పెద్ద చిచ్చునే రాజేసింది.
మహారాష్ట్రలో పుట్టి తూర్పు దిశగా పయనించి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే కృష్ణానది.. నాలుగు రాష్ట్రాల నీటి అవసరాలకు ఆసరానిస్తోంది. ఆ మేరకు వివాదాలకూ తావిచ్చింది. 70 ఏళ్లకిందట 2060 టీఎంసీలున్న కృష్ణా జలాల పంపకం దగ్గర నాలుగు రాష్ట్రాల మధ్య లడాయి ముదిరింది. పరిష్కారం కోసం రెండు సార్లు ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ట్రిబ్యునళ్లను దాటి సుప్రీంకోర్టు దాకా వెళ్లింది కృష్ణా జలాల వివాదం. అది గతం.
2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయి.. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జల జగడం 2.0 మొదలైంది. మా రాష్ట్రం సంగతేంటి అని తెలంగాణ నిలదియ్యడంతో.. కొత్తగా గైడ్‌లైన్స్ రాసుకోవాల్సి వచ్చింది. ప్రాజెక్టుల వారీగా రెండు రాష్ట్రాలకూ నీటి కేటాయింపులు జరగాలని, నీటి విడుదలకూ ప్రొటోకాల్స్ సిద్ధం చేయాలని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఛైర్మన్‌గా ఒక ఎపెక్స్ కమిటీని వేయాలని ప్రతిపాదించింది విభజన చట్టం.
అప్పటి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఛైర్మన్‌గా ఏర్పాటైన అపెక్స్ కమిటీ అపెక్స్ కమిటీ తొలి సమావేశం 2016లో జరిగింది. నాలుగేళ్ల తర్వాత రెండోసారి సమావేశమైంది. రెండురాష్ట్రాల నదీజలాల చాప్టర్లో అది కీలక పరిణామం.
>గోదావరి, కృష్ణా వరద జలాలపై దిగువ రాష్ట్రంగా ఏపీకే హక్కులుండాలి.
>కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలి.
>పాలమూరు-రంగారెడ్డి, దిండి లిఫ్టు పథకాలను ఆపాలి..
ఇలా కొన్ని బలమైన ప్రపోజల్స్ పెట్టారు ఏపీ సీఎం జగన్. వీటన్నిటికంటే ముఖ్యమైనది నీటి వాటాల పంపకం. 2015 జూన్‌లో జరిగిన ఒప్పందం ప్రకారమే నీటి పంపకాలు జరగాలి.. దీన్ని కృష్ణా బోర్డు అమలుచేయాలి.. అని గట్టిగా చెప్పారు జగన్. ఇటు.. తెలంగాణ వైఖరి కూడా అంతే కఠినంగా ఉంది. రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల్ని వెంటనే నిలిపెయ్యాలన్నది అప్పట్లో కేసీఆర్ పెట్టిన ప్రధాన డిమాండ్. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను తమకే అప్పగించాలన్నది మరో మెలిక. కృష్ణా బోర్డు ఏపీకి మద్దతుగా, తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించడం ద్వారా.. అప్పట్లోనే కయ్యానికి సై అన్నారు కేసీఆర్.
కృష్ణా, గోదారి జలాల విషయంలో రెండు రాష్ట్రాలదీ చెరో దారి. ముఖ్యంగా నీటి పంపిణీ మీద కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు పూర్తి అధికారం ఉంటుందని, బోర్డుల అనుమతి లేకుండా ఎవ్వరూ ఏమీ చెయ్యొద్దని కేంద్రప్రభుత్వం సూచించింది. ఇలా.. నీటి వాటాలపై నాలుగేళ్ల కిందట పడ్డ పీటముడి ఇప్పటికీ విడిపోలేదు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారి.. కొత్త ముఖ్యమంత్రులు వచ్చినా.. కృష్ణానదీ జలాల విషయంలో రాజీ కుదరలేదు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కోరిక మేరకు.. కేఆర్ఎంబీ ప్రత్యేకంగా సమావేశమైనా.. పరిష్కారం దిశగా అడుగులు పడలేదు.
నీటివాటాలు తేలకుండా కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత జరిగిందని, ఒక్క సంవత్సరం కోసం చేసుకున్న ఒప్పందాన్ని పదేళ్ల తర్వాత కూడా కాంగ్రెస్ కొనసాగించిందని.. దీంతో సమస్య మరింత క్లిష్టమైందని వాదిస్తోంది బీఆర్ఎస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం లేకపోతే కృష్ణానది నీటివాటాలు తేలడం అసాధ్యమని తేలిపోయింది. కానీ.. నీళ్లను పరిమితికి మించి వాడుకుంటోందని, కేంద్రప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తూ కేఆర్ఎంబీని తమకు అనువుగా మలుచుకుంటోందని తెలంగాణ వైపు నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏపీ వైఖరి ఎలా ఉండబోతోంది అనేది మెగా సస్పెన్స్. రెండురాష్ట్రాల మధ్య ఈ చిక్కుముడి వీడాలంటే ఇటువంటి సమ్మర్ సీజన్లు ఇంకా ఎన్ని పోవాలో మరి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..