
మేడికొండూరు, మార్చి 31: ఆడవారిలో అమ్మతనం సహజంగానే ఉంటుంది. తన కడుపున పుట్టని పిల్లలనే కాకుండా పసి పిల్లలందరినీ తన బిడ్డలుగానే భావించి ఆదరిస్తుంది. ఇది ప్రకృతి ఆడజన్మకు ఇచ్చిన పత్ర్యేక వరం. కానీ నేటి కాలంలో ఆడవారు రాక్షసుల్లా మారుతున్నారు. కట్టుకున్న భర్తలను, కడుపున పుట్టిన బిడ్డలను అతి దారుణంగా హతమారుస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే మరొకటి జరిగింది. సవతి పిల్లలను కన్న బిడ్డల్లా చూసుకుంటానంటూ భర్త జీవితంలోకి ప్రవేశించిన ఓ మహిళ అమ్మతనానికే కళంకం తెచ్చేలా ప్రవర్తించింది. తల్లిలేని అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారులకు ప్రేమ పంచాల్సింది పోయి.. దారుణంగా హింసించింది. ఫలితం చిన్నారుల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ అమానవీయ ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల ప్రకారం..
పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామానికి చెందిన కంచర్ల సాగర్ అనే వ్యక్తి తాపీ పని చేస్తుంటాడు. అతడికి పదేళ్ల క్రితం కృష్ణా జిల్లాకు చెందిన అనూషతో వివాహమైంది. అనూషకు తొలి కాన్పులో ఇద్దరు మగ కవల పిల్లలు కార్తీక్(6), ఆకాశ్(6)లు పుట్టారు. రెండోసారి గర్భం దాల్చి పాపకు జన్మనిచ్చి అనూష మృతి చెందింది. తల్లి కోసం అల్లాడుతున్న ఆ చిన్నారిని తండ్రి సాగర్ వేరొకరికి దత్తత ఇచ్చేశాడు. మగ పిల్లల్ని మాత్రం సాగర్ తన వద్దే ఉంచుకుంటున్నాడు.
ఈ క్రమంలో రెండేళ్ల కిందట సాగర్‌కు గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన లక్ష్మితో రెండో వివాహం జరిగింది. దీంతో సాగర్ తన ఇద్దరు కుమారులతో ఫిరంగిపురంలోనే కాపురం ఉన్నాడు. ఎనిమిది నెలల క్రితం లక్ష్మికి ఓ పాప పుట్టింది. ఇక అప్పటివరకు సవతి పిల్లలు ఇద్దరినీ రోజుకోరకంగా చిత్రహింసలు పెడుతూ నరకం చూపించింది. పిల్లల్ని హింసించినా భర్త సాగర్ పట్టించుకోకపోవడంతో మరింత రెచ్చిపోయింది. ఈ క్రమంలో మార్చి 29న లక్ష్మి చిన్నారులను చావగొట్టింది. పిల్లల అరుపులు, ఏడుపులు విని ఇరుగుపొరుగు పిల్లల మేనత్త విజయకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె అదే రోజు ఫిరంగిపురంకి వెళ్లింది. కానీ అప్పటికే అనర్ధం జరిగిపోయింది.
ఇవి కూడా చదవండి
కార్తీక్ తీవ్ర రక్తగాయాలై అపస్మారకస్థితిలో ఉండగా.. మరో బాలుడు ఆకాశ్‌ను బాగా వేడెక్కిన అట్లపెనం మీద చేతులు కట్టేసి కూర్చోబెట్టింది. కాలిన గాయాలతో విలవిల్లాడిన పసివాడిని చూసి భార్యాభర్తలను నిలదీసింది. దీంతో వాళ్లు పిల్లల్ని తీసుకుని కొండవీడు వెళ్లారు. దీంతో విజయ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కొండవీడు చేరుకునేటప్పటికే కార్తీక్ మృతి చెందాడు. కాలిన గాయాలతో ఉన్న ఆకాశ్‌ను హుటాహుటీన గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. పిల్లల్ని కొట్టి చిత్రహింసలు పెట్టినట్లు ఆధారాలు లభ్యం కావడంతో పోలీసులు లక్ష్మి, సాగర్‌లపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.