
పేదలకు కడుపు నిండా అన్నం పెట్టేందుకే సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్. కాంగ్రెస్ హయాంలోనే రేషన్ షాపుల విధానంతో పాటు బియ్యం సరఫరా పథకాలు మొదలయ్యాయని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సన్న బియ్యం పథకంపై అప్పుడే క్రెడిట్ వార్ మొదలైంది. పేదల కోసం ఆలోచించే ఈ పథకం తెచ్చామని కాంగ్రెస్ అంటుంటే.. ఈ పథకం ఖర్చులో మెజార్టీ వాటా కేంద్రానిదే అనే వాదనను తెరపైకి తెచ్చింది బీజేపీ.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన సన్నబియ్యం పంపిణీ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హుజూర్నగర్లో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం రేవంత్.. శ్రీమంతుల తరహాలో పేదలు కూడా సన్నబియ్యం తినాలనే ఆలోచనతోనే ఈ పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఎన్టీఆర్ కంటే ముందు కాంగ్రెస్ సీఎం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి పేదలకు రూపాయి 90 పైసలకే కిలో బియ్యం ఇచ్చే పథకాన్ని ప్రారంభించారన్నారు సీఎం రేవంత్. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ఈ పథకాన్ని కొనసాగించారని తెలిపారు. తాము తీసుకొచ్చిన సన్న బియ్యం పథకం చరిత్రలో నిలిచిపోతుందని.. చరిత్రలో ఎవరు సీఎం అయినా ఈ పథకం కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం రేవంత్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదల కోసమే ఆలోచిస్తుందని.. అందుకే వారి ఆకలి తీర్చేందుకు ఈ పథకం తెచ్చామని సీఎం రేవంత్ తెలిపారు. సోనియాగాంధీ ఆహార భద్రతా చట్టం తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారని కామెంట్ చేశారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సన్నబియ్యం పథకంలోని మెజార్టీ ఖర్చు భరిస్తోంది కేంద్రమే అన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఒక్కో కిలోకు రూ.40లు కేంద్రం చెల్లిస్తోందన్నారు. సన్న బియ్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై కిలోకు పడే భారం 10 మాత్రమేనన్నారు. రేషన్ షాపుల్లో కనీసం మోదీ ఫోటో కూడా పెట్టడం లేదన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు కేంద్రం ఎంత ఖర్చు చేస్తోంది.. రాష్ట్రం ఎంత ఇస్తోందనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
పేదలకు బియ్యం పంపిణీ సహా ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ వరకు అన్ని పథకాలు కాంగ్రెస్ హయాంలోనే మొదలయ్యాయని కాంగ్రెస్ చెబుతుంటే.. ఈ పథకం అమలు కోసం కేంద్రమే ఎక్కువ ఖర్చు చేస్తోందని బీజేపీ అప్పుడే కౌంటర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దీంతో రాబోయే రోజుల్లో ఈ అంశంపై రెండు పార్టీల మధ్య మరింతగా మాటల యుద్ధం కొనసాగే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.
ఇక మంగళవారం నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేయనున్నారు. వానాకాలంలో కొనుగోలు చేసిన సన్నవడ్లను సీఎంఆర్ కింద మిల్లులకు ఇచ్చిన ప్రభుత్వం.. అందులో దాదాపు సగం బియ్యాన్ని ఇప్పటికే జిల్లా స్థాయి గోదాములకు తరలించింది. ఏప్రిల్ కోటాకు సంబంధించి ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ షాపులకు సన్నబియ్యం సరఫరా మొదలైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..