
బెట్టింగ్ వ్యవహారాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్స్, ఆన్లైన్ యాప్స్‌పై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించామన్నారు. దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను వేయాలని నిర్ణయించినట్టు అసెంబ్లీలో వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదన్నారు ముఖ్యమంత్రి. అభివృద్ధి కోసం కలిసి వస్తే అన్ని పార్టీల సలహాలు, సూచనలు తప్పకుండా పాటిస్తామన్నారు.
ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించినా, నిర్వహణలో భాగస్వాములైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కేవలం ప్రచారం కల్పించేవారిని విచారించడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదన్న సీఎం, పక్క రాష్ట్రాలు, పక్క దేశాల్లో కూడా విచారణ చేయాల్సి ఉంటుందన్నారు. అందుకే అవసరమైన చర్యలు తీసుకునేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైతే చట్ట సవరణ చేసి శిక్షను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వ్యసనాలకు తెలంగాణలో తావులేదు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని కొందరు మాట్లాడుతున్నారు. ఏ చిన్న సంఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. నడిబజారులో న్యాయవాద దంపతులను నరికి చంపితే ఆనాటి ప్రభుత్వం స్పందించలేదు. ఆనాటి వెటర్నరీ డాక్టర్ అత్యాచార ఘటన విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసన్నారు సీఎం రేవంత్. మహిళలపై జరిగిన అత్యాచారాల్లో 2020 లో దేశంలోనే రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందన్నారు. బాధితులపై సానుభూతితో ఉండి, నేరగాళ్లపై కఠినంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. కానీ ఇలాంటి ఆరోపణలు చేసి ప్రభుత్వంపై దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా శాంతిభద్రతలు క్షీణించాయని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిపై యాసిడ్ దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రాన్ని దివాళా తీయించి తెలంగాణ ప్రతిష్టను మసకబార్చేలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు సీఎం. ఈ కుట్రలను తెలంగాణ సమాజం సహించదన్న సీఎం, అధికారం లేకపోతే క్షణం కూడా ఉండలేమన్న తరహాలో వారు వ్యవహరిస్తున్నారన్నారు. ఇది తెలంగాణ సమాజానికి ఏ రకంగా మేలు చేస్తుందని సీఎం ప్రశ్నించారు. 15 నెలలుగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పాలన సాగిస్తున్నామని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష నాయకుడిగా జానారెడ్డి లాంటి వారిని ఆదర్శంగా తీసుకోండి.. సూచనలు ఇవ్వండి. మీరు హడావిడి చేసినంత మాత్రాన ఎన్నికలు రావని, మళ్లీ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చేది 2028లోనే అని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్లో అంతర్గత పోటీ రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోందన్నారు. ముఖ్యమంత్రిగా నా దగ్గరకు తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తానన్నారు. గజ్వేల్ శాసనసభ్యుడు వచ్చినా.. ఆ నియోజకవర్గ సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. మొన్న పద్మారావు గారు తన నియోజకవర్గంలో సమస్యలపై కలిశారు… వెంటనే ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేశారు. మేం మంచిని మంచి అంటాం.. చెడును చెడు అంటాం.. మాకు చెడు ఆలోచనలు లేవని వెల్లడించారు. మమ్మల్ని బదనాం చేస్తే మీరు మంచి వారు కాలేరు.. మేం వివక్ష చూపం.. వివక్ష మా విధానం కాదని ముఖ్యమంత్రి అన్నారు.
అడ్డగోలుగా మేం బడ్జెట్ ను ప్రవేశపెట్టలేదన్న ముఖ్యమంత్రి, చేసేదే చెప్తాం.. చెప్పిందే చేస్తాం అనే విధానంతో బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. 95 శాతం మేం ప్రవేశ పెట్టిన బడ్జెట్ నిజం కాబోతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం భూసేకరణ చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, 25 ఏండ్ల క్రితం బిల్లీరావుకు గచ్చిబౌలిలో భూమిని కేటాయించారన్నారు. ఆ భూమితో సెంట్రల్ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని, ఇప్పటి వరకు బిల్లీరావు నుంచి భూమిని వెనక్కు తీసుకోలేదన్నారు సీఎం రేవంత్. ఓపెన్ ఆక్షన్ ద్వారా పెట్టుబడుల కోసం అంతర్జాతీయ సంస్థలకు ఇవ్వాలని ముందుకు వస్తే.. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులకు తీసుకొచ్చేందుకు అక్కడ విస్తరణ చేయాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.
రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించాలా వద్దా? అని హరీష్ రావును సూటిగా అడిగారు సీఎం. రేడియల్ రోడ్లు వేయాలా వద్దా? అభివృద్ధి కోసం భూములు సేకరించాలా వద్దా? ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలా వద్దా? అంటూ సూటిగా ప్రశ్నలు సంధించారు. కొండపోచమ్మ సాగర్ నుంచి ఫామ్ హౌస్‌లకు డైరెక్టు కాలువలు తీసుకెళ్లింది ఎవరు? అని సీఎం ప్రశ్నించారు. ప్రతీది అడ్డుకోవాలనే కుట్ర ఏ రకంగా మంచిదన్నారు. మేం తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని, మొత్తం తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. కుట్రలు, కుతంత్రాలకు, అసెంబ్లీలో మైకును వాడుకుంటామంటే ఒప్పుకోమని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
అభివృద్ధి, భూసేకరణ విషయంలో మీరు అడ్డుపడకండి.. పరిహారం ఏం ఇవ్వాలో సూచనలు చేయండి అంటూ విపక్షాలను సీఎం కోరారు. ఇది ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చేదే తప్ప.. ఎవరి ఇంట్లో నుంచి ఇచ్చేది కాదన్నారు. మల్లన్న సాగర్ లో, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసులు వేయించింది వాళ్లే, పార్టీలో చేర్చుకున్నది వాళ్లే అంటూ సీఎం ఎద్దేవా చేశారు. ఆనాడు పార్టీ మారిన వాళ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఉప ఎన్నికలు రాలేదన్నారు. గతంలోనే రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి? గతంలో ఆచరించిన సంప్రదాయాలనే ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం. సభ్యులెవరూ ఆందోళన చెందొద్దు.. ఏ ఉప ఎన్నికలు రావు.. మా దృష్టి ఉప ఎన్నికలపై లేదు. మా దృష్టి రాష్ట్ర అభివృద్ధిపైనే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వానికి సహేతుకమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..