

పచ్చి మామిడిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి వ్యాధుల నుండి రక్షణ ఇచ్చే శక్తిని పెంపొందించేందుకు సహాయపడుతుంది. వాతావరణ మార్పులతో వచ్చే జలుబు, దగ్గు, వైరల్ అంటువ్యాధుల వంటి సమస్యలను అడ్డుకునే శక్తిని ఇస్తుంది. వేసవి వేడి తీవ్రంగా ఉండే సమయాల్లో శరీరం వేడి పెరిగే అవకాశం ఉంటుంది. అప్పుడు పచ్చి మామిడిని తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. ఇందులో ఉండే సహజ ఎలక్ట్రోలైట్లు నీటి స్థాయిని సమతుల్యంలో ఉంచుతాయి. అధికంగా వాపు, తలనొప్పి లాంటి వేడి కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గించడంలో సహాయం చేస్తుంది.
పచ్చి మామిడిలో ఫైబర్, పెక్టిన్ లాంటి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ మెరుగవ్వడానికి సహాయపడతాయి. ఆమ్లత్వం, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే మామిడికాయను ఉప్పు, కారం కలిపి తినడం మంచిది. ఇది పేగుల పనితీరును మెరుగుపరిచే దృష్టితో జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది.
పచ్చి మామిడిలో కాల్షియం మంచి స్థాయిలో ఉంటుంది. ఇది ఎముకలు బలపడేందుకు అవసరమైన మూలకం. వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనంగా మారే అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులను నివారించడానికి పచ్చి మామిడిని ఉపయోగించడం సహాయకరంగా ఉంటుంది.
ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. హృదయానికి సక్రమంగా పనిచేయడానికి పొటాషియం అవసరం. ఇది శరీరంలోని ద్రవాల సమతుల్యతను కాపాడుతూ గుండెపై సానుకూల ప్రభావం చూపుతుంది.
పచ్చి మామిడిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అధిక కొవ్వు ఉండకపోవడం వల్ల బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. జీర్ణక్రియను బలోపేతం చేయడం ద్వారా శరీరంలోని చెడు కొవ్వును కరిగించే ప్రక్రియ వేగవంతమవుతుంది.
పచ్చి మామిడిని తరచుగా తీసుకోవడం వల్ల కొందరికి ఆమ్లత్వం పెరిగే అవకాశాలు ఉంటాయి. కావున దీనిని పరిమితంగా తీసుకోవడం ఉత్తమం. రోజూ కొద్దిగా తీసుకుంటే శరీరానికి లాభాలే తప్ప నష్టం ఉండదు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)