
వేసవి అంటే ఉక్కపోత, ఎండ వేడి, చెమటలు, నీరసం. ఈ కాలంలో శరీరంలోని తేమ త్వరగా పోవడం వల్ల డీహైడ్రేషన్, బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాంటి పరిస్థితుల్లో నీటిని ఎక్కువగా కలిగిన పండ్లను ఆహారంలో చేర్చడం చాలా అవసరం. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా.. తీపి రుచితో సులభంగా జీర్ణమయ్యే ప్రాకృతిక పోషకాహారం కూడా. ఇప్పుడు వేసవిలో తప్పక తినాల్సిన కొన్ని పండ్ల గురించి తెలుసుకుందాం.
పుచ్చకాయ
వేసవిలో ఎక్కువగా కనిపించే.. అందరికీ ఇష్టమైన పండు పుచ్చకాయ. ఇందులో దాదాపు 91 శాతం నీరు ఉంటుంది. ఇది తక్కువ కేలరీలు కలిగి ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికీ అనుకూలం. ఇందులో ఉండే ఎలక్ట్రోలైట్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని డీటాక్స్ చేయడంలో సహాయపడతాయి. వేసవిలో శరీరాన్ని చల్లబరచడం, శక్తినివ్వడం వంటి లాభాలు పుచ్చకాయ తినడం ద్వారా లభిస్తాయి.
కర్బూజ
కర్బూజ పండు కూడా వేసవికి చాలా మంచిది. ఇందులో 90 శాతం వరకు నీరు ఉండే గుణం ఉంది. ఇది ఫైబర్‌తో కూడిన పండు కావడం వల్ల జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది లోపల నుంచి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఎండ వాతావరణంలో ప్రాకృతిక శక్తిని అందించే శ్రేష్ఠమైన పండ్లలో ఇది ఒకటి.
పైనాపిల్
పైనాపిల్ రుచికరమైన పండుగానే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో సుమారు 86 శాతం నీరు ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటంతో శరీర కణాలను నష్టపోకుండా కాపాడుతుంది. అలాగే విటమిన్ సీ అధికంగా ఉండటంతో రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. వేసవిలో దీన్ని తినడం వల్ల శరీరం శక్తివంతంగా, చల్లగా ఉంటుంది.
పనసపండు
పనసపండు తరచుగా అధిక కార్బోహైడ్రేట్లు, ఎనర్జీ కోసం తినే పండుగా పేరు పొందింది. ఇందులో దాదాపు 76 శాతం నీరు ఉండటం వలన వేసవిలో తినడం ద్వారా శరీరానికి తేమ అందుతుంది. ఇది బీ-కాంప్లెక్స్ విటమిన్లు, పొటాషియం వంటి పోషకాలు అందించగలదు. ఇది తింటే వెంటనే శక్తి లభిస్తుంది.
జామకాయ
జామకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండు. ఇందులో సుమారు 80 శాతం నీరు ఉంటుంది. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. ఇవి శరీరంలోని ఎలక్ట్రోలైట్లు సమతుల్యంగా ఉండేలా చూసుకుంటాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.
ద్రాక్ష
ద్రాక్షలో దాదాపు 81 శాతం నీరు ఉంటుంది. ఇందులో విటమిన్ A, C, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో ఉపయోగపడుతుంది. వేసవిలో వేడి నుంచి ఉపశమనం కలిగించే చక్కటి పండు ఇది.
వేసవిలో ఎండ వేడి నుండి రక్షించుకునేందుకు ప్రకృతిచ్చిన ఈ పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా.. శక్తిని, చల్లదనాన్ని, పోషకాలను అందిస్తాయి.