
వేరుశెనగలు మనకు అందుబాటులో ఉండే ఆరోగ్యకరమైన ఆహారాల్లో ఇవి ఒకటి. ఇవి ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు సమృద్ధిగా కలిగి ఉండటంతో శక్తిని అందిస్తాయి. రోజువారీ డైట్లో వేరుశెనగలు భాగం చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. అయితే వేరుశెనగలు తిన్న వెంటనే కొన్ని ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి తక్కువ మేలు కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో సమస్యలకు కారణం కూడా కావచ్చు. అలాంటి ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వేరుశెనగలు తిన్న వెంటనే పాలు తాగడం వల్ల జీర్ణక్రియ మీద ప్రభావం చూపుతుంది. వేరుశెనగల్లోని నూనె పదార్థాలు పాలలోని ప్రొటీన్లతో కలిసి కడుపులో అసౌకర్యాన్ని కలిగించవచ్చు. దీనివల్ల వాంతులు, ఉబ్బరం, అసిడిటీ, కడుపులో భారం వంటి సమస్యలు రావొచ్చు. కాబట్టి వేరుశెనగలు తిన్న తర్వాత కనీసం ఒక గంట పాటు పాలు తాగకుండా ఉండటం మంచిది.
నిమ్మకాయ, నారింజ, ద్రాక్ష వంటి పండ్లలో ఆమ్లత ఎక్కువగా ఉంటుంది. వేరుశెనగలు తిన్న వెంటనే ఈ రకమైన పండ్లు తీసుకుంటే గొంతు సమస్యలు, దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా తినడం వల్ల శరీరం అనారోగ్యంగా మారే ప్రమాదం ఉంటుంది.
చాలా మందికి వేరుశెనగలు తినడం అంటే టీ లేదా కాఫీతో కలిపి తినడం అలవాటుగా ఉంటుంది. కానీ ఇది మంచి అలవాటు కాదు. టీ లేదా కాఫీలో ఉండే టానిన్ అనే పదార్థం వేరుశెనగల్లోని ముఖ్యమైన పోషకాలను శరీరం గ్రహించకుండా చేస్తుంది. ఫలితంగా వేరుశెనగ తిన్న ప్రయోజనం పోయే అవకాశం ఉంటుంది. అదీ కాకుండా కొంతమందిలో అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
వేరుశెనగలు తిన్న వెంటనే నువ్వులు తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది అజీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. అలాగే వేరుశెనగ తిన్న వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల గొంతులో ఇన్ఫెక్షన్, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా శీతాకాలంలో ఇది ఇంకా ప్రమాదకరం.
వేరుశెనగలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ వాటిని తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడంలో జాగ్రత్త పాటించాలి. వేరుశెనగల్లోని పోషకాలను శరీరం పూర్తిగా గ్రహించాలంటే సరైన సమయానికి సరైన ఆహారం తీసుకోవడం అవసరం.