
అమ్మో చిరుత.. అదిగో చిరుత.. ఇదే ఇప్పుడు తిరుపతి వేదిక్ యూనివర్సిటీలో వినిపిస్తున్నది. కనిపిస్తున్న హెచ్చరిక అదే..! వణికిస్తున్న చిరుతల సంచారం వేద విద్యార్థులనే కాదు సిబ్బంది వెన్నులోనూ వణుకు పుట్టిస్తున్న భయం. తరచూ కంటపడుతున్న చిరుతల పని పట్టే పనిలో బోన్లు ఏర్పాటు చేసి ఆపరేషన్ చిరుత చేపట్టింది ఫారెస్ట్ యంత్రాంగం. కానీ 20 రోజులుగా దడ పుట్టిస్తున్న చిరుతల సంచారం మాత్రం కంటి మీద కునుకులేకుండా చేసింది.
వేదఘోష వినిపించే ప్రాంతం చీకటి పడితే చాలు చిరుతల గాండ్రింపుల శబ్దంతో కలవరపెడుతోంది. ఒకవైపు దట్టమైన శేషాచలం అటవీ ప్రాంతం. మరోవైపు పక్కనే ఎస్వీ జూపార్క్. ఇలా 7 కొండలకు ఆనుకుని అలిపిరికి సమీపంలో ఉన్న తిరుపతిలోని యూనివర్సిటీలను ఇప్పుడు చిరుతల భయం వెంటాడుతోంది. ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ తోపాటు శ్రీవెంకటేశ్వర విశ్వ విద్యాలయం, ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలను చుట్టేస్తున్న చిరుతలు, ఇప్పుడు విద్యార్థులను వర్సిటీ సిబ్బందిని ఆందోళనకు గురి చేస్తున్నాయి.
గత కొన్ని నెలలు గా తిరుమల నడక మార్గాల్లో ఆందోళన కలిగించిన చిరుతల సంచారం ఇప్పుడు యూనివర్సిటీల్లో కొనసాగుతోంది. గత 20 రోజులకు పైగా వర్సిటీల్లోనే చిరుతలు తిష్ట వేసినట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రత్యేకించి ఎస్వీ వేదిక్ యూనివర్సిటీలో రోజూ విద్యార్థులు, ఉద్యోగుల కంట పడుతున్న చిరుతలు వేట కొనసాగిస్తున్నాయి. దీంతో చిరుతల కదలికలు శృతి మించడంతో భయం నెలకొంది. వేద విశ్వవిద్యాలయం అకాడమిక్ బిల్డింగ్ తోపాటు హాస్టల్స్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ పరిసరాల్లోనే చిరుతలు సంచరిస్తున్నాయంటున్నారు.
వేదిక్ యూనివర్సిటీలో సంచరించే జింకలు, కుక్కలను కాపు కాచి అటాక్ చూస్తున్న చిరుతలు సులభంగా వేట కొనసాగిస్తున్నాయి. ఈజీగానే ఆహారం, దాహం తీర్చుకునే వసతి ఉన్న వేదిక్ యూనివర్సిటీ ప్రాంతాన్ని వీడేది లేదన్నట్లు చిరుతల సంచారం కొనసాగుతోంది. దీంతో సాయంత్రం ఆరు గంటలు అయితే చాలు వేదిక్ యూనివర్సిటీ మూగబోతోంది. నిర్మానుషంగా మారిపోతుంది. విద్యార్థుల అలజడి తోపాటు వేద ఘోష ఆగిపోతోంది. సాయంత్రం 5.30 గంటలకంతా వేద విద్యార్థులను హాస్టల్ గదుల్లోకి పంపుతున్న సిబ్బంది, అధికారులు కూడా వర్సిటీని వదిలి ఇళ్లకు చేరుకుంటున్నారు.
ఎస్వీ వేదిక్ యూనివర్సిటీ లో నాలుగు బ్లాక్లు ఉన్న వసతి గృహానికి చుట్టూ కంచె నిర్మాణం చేపట్టగా కంచె అంచులు దాకా వస్తున్న చిరుతలు ఆకలి తీర్చుకునేందుకు అక్కడి దాకా వచ్చి వేట కొనసాగిస్తున్నాయి. వర్సిటీలో ఉన్న నీటి కుంటల్లో దాహం తీర్చుకుంటున్నాయి. ఇలా చిరుతలు వచ్చే ప్రాంతానికి వస్తున్న చిరుతలు అక్కడే ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు చిక్కినా అక్కడ ఏర్పాటు చేసిన బోన్ల లో మాత్రం చిక్కకుండా చాకచక్యంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో చీకటి పడితే చాలు వేదిక్ యూనివర్సిటీ దారులను మూసివేస్తున్న సెక్యూరిటీ చిరుతల కదలికలపై హెచ్చరికలతో అప్రమత్తం చేస్తోంది. మరోవైపు రాత్రంతా గస్తీ తిరుగుతున్న ఫారెస్ట్ సిబ్బంది చిరుతల కదలికలను గమనిస్తోంది. ఇలా చిరుతల భయం వేదిక్ యూనివర్సిటీని పరిస్థితి యాజమాన్యం టీటీడీకి మొరపెట్టుకుంటుంది. 70 ఎకరాలకు పైగా ఉన్న విస్తీర్ణంలో ఉన్న వేదిక్ యూనివర్సిటీ చుట్టూ కంచె నిర్మాణం చేపట్టాలని కోరుకుంటోంది.
మరోవైపు వేద విద్యార్థులకు చిరుతల నుంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు వర్సిటీ యత్రాంగం తీసుకుంటోంది. ప్లే గ్రౌండ్స్ దూరంగా ఉంచుతోంది. వేద విద్యార్థులు ఉండే హాస్టల్ బ్లాక్ లకు పూర్తి రక్షణ కల్పిస్తోంది. చిరుతల సంచారం వర్సిటీ అధికారుల వెన్ను లో వణుకు పుట్టిస్తుండగా విద్యార్థుల్లో చిరుత భయం పోగొట్టే ప్రయత్నం చేయడం టాస్క్ గా మారి పోయింది. అయితే చిరుతలు సంచరించే అటవీ ప్రాంతాల్లో వర్సిటీల నిర్మాణం జరిగిందంటున్న కొందరు అందుకే ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు. చిరుతల జాడ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్న అటవీ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. చిరుతలు కనిపించిన ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసింది. వాటిని బంధించేందుకు నాలుగు చోట్ల బోన్లు కూడా ఏర్పాటు చేసింది. ఎరవేసి ఎదురుచూస్తోంది. వేద విశ్వ విద్యాలయంలో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసిన అటవీ శాఖ గుంపులు గుంపులు గానే ఎక్కడికైనా వెళ్ళాలంటోంది.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. r