
వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న చిరుత ప్రాణాలను కాపాడుకోవడానికి పోరాడి పోరాడి చివరకు ఓడిపోయింది. చిరుతను కాపాడడంలో అటవీశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. చిరుత మృతిపై పరిసర ప్రాంతంలోని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా.. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం పొన్నూటిపాలెం అడవి పక్కన పొలం సమీపంలో వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో రెండు సంవత్సరాల వయసు కలిగిన చిరుత చిక్కుకుంది. బుధవారం(ఏప్రిల్ 16) తెల్లవారుజామున ఉచ్చులో చిక్కుకున్న చిరుత ఉదయం 11 గంటల వరకు బాగానే ఉంది. ఆ తర్వాత చనిపోయిందని గ్రామస్థులు చెబుతున్నారు. అటవీశాఖ అధికారులు మాత్రం చిరుతకు ఎలాంటి ప్రాణాపాయం లేదని రిస్క్యూ టీం సహకారంతో ద్వారా దాన్ని కాపాడి తిరిగి అడవులకు పంపిస్తామని భరోసా కల్పించారు.
కానీ చిరుతకు గన్ ద్వారా మత్తుమందు ఇవ్వడానికి సామగ్రి అంతా సిద్ధం చేసినప్పటికీ షూటర్ సకాలంలో రాలేదు. అతని కోసం అటవీశాఖ అధికారులు గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. చివరకు అధికారుల నిర్లక్ష్యం కారణంగా చిరుత ఉచ్చులోనే తుది శ్వాస విడిచింది. అటవీ ప్రాంతం సమీపంలోని పంటలను వన్యప్రాణుల నుంచి కాపాడుకునేందుకు రైతులు పొలాల చుట్టూ కంచె వేసుకోగా, అటుగా వచ్చిన చిరుత అందులో ఇరుక్కు పోయింది.
రాత్రి సమయంలో ఉచ్చులో ఇరుక్కుని బయటకు రాలేకపోయింది చిరుత. దీంతో చిరుతను కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నించారు. ఉదయం 8 గంటల సమయంలో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన స్థానికులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల దాహంతో ఉన్నట్లు గుర్తించారు. పైప్ ద్వారా అయినా నీటిని అందించే ప్రయత్నం చేసిన స్థానికులను ఫారెస్ట్ అధికారులు అటు వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ముందుకు ఎవరు వెళ్లలేక పోయారు. కంచెలో చిక్కుకు పోయిన చిరుత తప్పించుకోలేక మధ్యాహ్నం సమయంలో ప్రాణాలు విడిచింది. చిరుతకు నీటి సౌకర్యం అందించలేక, ఉచ్చు నుంచి కాపాడలేక పోవడంతో చిరుత ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు మండిపడుతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..