
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అధికారుల లంచాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఏసీబీ అధికారులు తరచూ దాడులు చేసి లంచగొండులను పట్టుకుంటున్నా మిగిలిన అధికారుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. వనపర్తి జిల్లాలో అయితే విద్యుత్ శాఖ అధికారుల లంచాలు మరింత ఆందోళన గురిచేస్తున్నాయి. ఏడాది గడవకముందే అదే విద్యుత్ ఆఫీస్ లో మరో అవినీతి అధికారి పట్టుబడటం కలకలం రేపుతోంది. వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండలం ఎలక్ట్రికల్ ఏఈ కొండన్న రూ.10 వేలు లంచం తీసుకొని ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డాడు.
నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన వ్యాపారి వనపర్తి జిల్లా ఖిల్లాఘనపూర్ మండలం మల్కాపూర్ గ్రామ శివారులో తిరుమల ఆగ్రో ఇండస్ట్రీస్ పేరుతో రైస్ మిల్ నిర్మాణం చేపట్టారు. రైస్ మిల్కు విద్యుత్ సరఫరా కోసం TGSPDCLకు డీడీ చెల్లించారు. విద్యుత్ శాఖ అధికారులు టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను మహబూబ్ నగర్ కు చెందిన కాంట్రాక్టర్ సలీం అనే వ్యక్తికి అప్పగించారు. దీంతో సలీం 160 KV పనులను పూర్తి చేశాడు. విద్యుత్ కనెక్షన్ అప్రూవల్ ఇవ్వాల్సిందిగా ఏఈ కొండన్నను కోరగా.. ఇందుకోసం తనకు కొంత నగదును ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఐదు నెలల క్రితం రూ.30 వేల రూపాయలు కొండన్నకు ఇచ్చాడు సలీం. అయితే మరో రూ.20 వేలు కావాలని ఏఈ కొండన్న కాంట్రాక్టర్ సలీంను డిమాండ్ చేశాడు. దీంతో విసుగు చెందిన కాంట్రాక్టర్ మహబూబ్ నగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఏఈ కొండన్నకు రూ.10 వేలు అందించే క్రమంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఏఈ కొండన్న ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. గతేడాది మే 31వ తేదీన ఇదే జిల్లాలో ఏసీబీ అధికారులు ముగ్గురు విద్యుత్ శాఖ అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఘటన అనంతరం కార్యాలయంలో లంచాలకు వ్యతిరేకంగా వాల్ స్టిక్కర్స్ అంటించి వెళ్ళారు. ఏడాది తిరగకముందే మరో విద్యుత్ శాఖ అధికారి ఏసీబీకి చిక్కడం తీవ్ర కలకలం రేపుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి