
ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో హిట్ అండ్ రన్ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బుధవారం(మార్చి 12) రాత్రి డెహ్రాడూన్లోని రాజ్పూర్ రోడ్డులోని సాయిబాబా ఆలయం సమీపంలో రోడ్డుపై పాదచారులను వేగంగా వచ్చిన కారు దూసుకుపోయింది. ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
బుధవారం రాత్రి రాజ్పూర్ రోడ్డులోని సాయిబాబా ఆలయం సమీపంలో కొంతమంది నడుచుకుంటూ వెళుతుండగా, వేగంగా వచ్చిన బెంజ్ కారు అక్కడి నుంచి వెళ్లిందని స్థానికులు చెబుతున్నారు. నడిచి వెళ్తున్న వారిని కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత సంఘటనా స్థలంలో అరుపులు, కేకలు మిన్నంటాయి. కారులో ఉన్న డ్రైవర్ ఏదో విధంగా కారు దిగి పారిపోయాడు. రోడ్డు పక్కన నడుస్తున్న నలుగురు కార్మికులను కారు మొదట ఢీకొట్టింది. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దీని తరువాత, రోడ్డుపై నిలబడి ఉన్న మరో ఇద్దరు వ్యక్తులను కారు ఢీకొట్టింది. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ పారిపోయాడు. వారు వెంటనే ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించారు. కారు చాలా వేగంగా వెళుతోందని, అదుపు తప్పి నడిచి వెళ్తున్న కార్మికులను ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే, ఐజీ గర్హ్వాల్ రాజీవ్ స్వరూప్, ఎస్ఎస్పీ అజయ్ సింగ్, ఎస్పీ సిటీ, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు నలుగురు మరణించినట్లు ప్రకటించారు. గాయపడిన ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నిందితుడు డ్రైవర్ కోసం పోలీసులు వెతుకుతున్నారని రాజ్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ పీడీ భట్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి సంఘటనా స్థలంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, మెర్సిడెస్ కారు చండీగఢ్ నంబర్ కలిగి ఉంది. కారు ఆరుగురిని ఢీకొట్టిందని, వారిలో నలుగురు మరణించారని డెహ్రాడూన్ ఎస్ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. నిందితుడైన డ్రైవర్ కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామన్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..