

చాలా మందికి ప్రతి రోజు స్నానం చేయడం అలవాటు. ఉదయాన్నే ఫ్రెష్‌గా మొదలవ్వాలంటే గానీ, సాయంత్రం విశ్రాంతిగా ఉండాలంటే గానీ షవర్ వేద్దాం అనిపిస్తుంది. కానీ ప్రతిరోజూ స్నానం చేయడం నిజంగా అవసరమా..? ఇంతకముందు దీన్ని కొంతమంది తప్పుగా భావించేవారు.
నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక తాజా అధ్యయనం కొన్ని కొత్త విషయాలను వెల్లడించింది. స్నానం చేసే విధానం, ఎంత తరచుగా చేయాలి అనే విషయంలో చాలా మందిలో ఉన్న నమ్మకాలను ఈ పరిశోధన పరిశీలించింది. ఆరోగ్యంగా ఉండే చర్మం కోసం వాస్తవంగా ఏం అవసరమో ఇందులో స్పష్టంగా చెప్పబడింది.
చర్మం మీద సహజ నూనెలు ఉంటాయి. ఇవి చర్మాన్ని కాపాడతాయి. కానీ రోజూ స్నానం చేస్తే ఇవి పోతాయి. అలాగే మన శరీరంపై ఉపయోగపడే బ్యాక్టీరియా కూడా పోవచ్చు. ఇలా అయ్యే చర్మం పొడిబారే అవకాశముంది. పైగా పగుళ్లు రావచ్చు. అప్పుడు ప్రమాదకరమైన బ్యాక్టీరియా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఇన్ఫెక్షన్లు, ఎక్జిమా, సోరియాసిస్ వంటివి పెరగవచ్చు.
నీటిలో ఎక్కువసేపు గడిపితే చర్మం ఎక్కువగా పొడిబారుతుంది అని తాజా అధ్యయనంలో పేర్కొన్నారు. షవర్ తీసుకునే సమయం తక్కువగా ఉండటం మంచిది. వేడి నీటికి బదులు చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం చర్మానికి మంచిది. స్నానం సమయంలో వాడే కొన్ని పదార్థాలు కూడా హానికరం కావచ్చు. ఉదాహరణకు మిథైలిసోథియాజోలినోన్, సల్ఫేట్లు, పారాబెన్లు వంటి రసాయనాలు చర్మానికి సమస్యలు కలిగించవచ్చు. ఇవి అలెర్జీలు వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే సాధారణ సబ్బుల బదులు మృదువైన క్రీమ్‌లను ఉపయోగించడం ఉత్తమం.
ఈ అధ్యయనంలో 438 మంది ఎక్జిమా ఉన్నవారిని తీసుకున్నారు. వారిని రెండు గ్రూపులుగా చేశారు. ఒక గ్రూప్ రోజూ స్నానం చేసింది. మరో గ్రూప్ వారానికి కొన్ని సార్లు మాత్రమే స్నానం చేసింది. అధ్యయనం తరువాత రెండు గ్రూపుల మధ్య పెద్ద తేడా ఏమీ కనిపించలేదు. ఎవరి చర్మం ఎక్కువగా పొడిబారలేదని.. ఎక్జిమా లక్షణాల్లో గణనీయమైన మార్పులు లేవని తేలింది.
ఇంతకు ముందు రోజూ స్నానం చేయొద్దని చెప్పేవారు. కానీ ఈ అధ్యయనం వాళ్ల అభిప్రాయాన్ని మార్చింది. చర్మానికి పెద్దగా నష్టం లేకుండా రోజూ స్నానం చేయొచ్చని ఫలితాలు చూపించాయి. ప్రత్యేకించి ఎక్జిమా ఉన్నవారు కూడా రోజూ స్నానం చేయవచ్చు.