
మన ఆరోగ్యానికి నిద్ర ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శరీరం సరిగ్గా పని చేయాలంటే రోజుకి కనీసం 7–8 గంటల నిద్ర అవసరం. కానీ ఈ రోజుల్లో బిజీ లైఫ్‌స్టైల్, ఒత్తిడి, అనారోగ్యకరమైన అలవాట్ల వల్ల చాలా మందికి నిద్ర సరిగా రాదు. అలాంటి పరిస్థితుల్లో మన ఆహారాన్ని సరిగ్గా నియంత్రించుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చు. కొన్ని సహజ పదార్థాలు శరీరంలో మెలటోనిన్, సెరటోనిన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేసి హాయిగా నిద్రపోయేలా చేస్తాయి. అలాంటి సహజ ఆహారాల్లో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం
బాదం శక్తివంతమైన పోషకాహారంగా గుర్తించబడింది. ఇందులో మెగ్నీషియం, హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మెగ్నీషియం మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ స్థాయిని పెంచుతుంది. మానసికంగా రిలాక్స్ కావడంలో సహాయపడుతుంది. రాత్రి భోజనం తర్వాత రెండు మూడు బాదాలను తీసుకుంటే చాలు హాయిగా నిద్ర పడుతుంది.
కివి పండు
కివి పండులో విటమిన్ సి, ఈ, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో సెరటోనిన్ స్థాయిని పెంచుతాయి. సెరటోనిన్ నిద్రకి అవసరమైన మెసెంజర్‌గా పని చేస్తుంది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక కివి పండు తింటే నిద్ర నాణ్యత మెరుగవుతుంది.
ఫ్యాటీ ఫిష్
ట్యూనా, సాల్మన్ వంటి చేపల్లో విటమిన్ డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే నిద్రకు అవసరమైన స్లీప్ హార్మోన్స్ ను శరీరంలో ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. ఈ చేపలను వారానికి రెండు సార్లు తినడం వలన రాత్రిపూట హాయిగా నిద్ర పడుతుంది.
చెర్రీ పండ్లు
చెర్రీలు సహజంగా మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్‌ను కలిగి ఉంటాయి. ఇది నిద్ర సమయాన్ని మెరుగుపరచడంలో చాలా ముఖ్యమైనది. పడుకునే ముందు చెర్రీ జ్యూస్ తాగితే నిద్ర త్వరగా పట్టే అవకాశముంటుంది. ఇది నిద్రపోవడం కష్టంగా అనిపించే వారికీ మంచి సహాయకారి.
గుమ్మడి గింజలు
ఇవి ట్రిప్టోఫాన్, మెగ్నీషియం, జింక్ లాంటి పోషకాలతో నిండిపోయి ఉంటాయి. ఇవి నిద్రకు అనుకూలంగా పనిచేసే హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. గుమ్మడి గింజలు రాత్రి తినడం వల్ల నిద్ర సాఫీగా వస్తుంది.
అరటిపండు
అరటిపండులో మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి కండరాలను విశ్రాంతిగా ఉంచడంలో సహాయపడతాయి. శరీరం రిలాక్స్ అయి నిద్ర మంచిగా పడుతుంది. రాత్రి ఒక అరటిపండు తినడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు.
వాల్నట్స్
వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ట్రిప్టోఫాన్, మెలటోనిన్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి నిద్ర సంబంధిత హార్మోన్లను ప్రేరేపిస్తాయి. శరీరానికి అవసరమైన విశ్రాంతిని కలిగించి హాయిగా నిద్రపోవడానికి తోడ్పడతాయి. ఈ ఆహార పదార్థాలు నిద్రనూ మెరుగుపరచడమే కాదు.. ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తాయి. ఈ ఆహారాలను మీ రోజువారీ డైట్లో చేర్చండి.. హాయిగా నిద్రపోండి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)