
కర్ణాటక రాష్ట్రంలోని కైగా వద్ద 700 మెగావాట్స్ ఎలక్ట్రిక్ సామర్థ్యం కలిగిన రెండు అణు రియాక్టర్ యూనిట్ల నిర్మాణానికి సంబంధించి పర్చేజ్ ఆర్డర్ ను మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) బుధవారం(ఏప్రిల్ 23) అందుకుంది. ముంబైలో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) సీనియర్ అధికారుల నుండి పర్చేజ్ ఆర్డర్ ను ఎంఈఐఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) సి.హెచ్. సుబ్బయ్య అందుకున్నారు. కైగా యూనిట్లు 5, 6 అణు రియాక్టర్లను ఎన్పీసీఐఎల్ కోసం ఎంఈఐఎల్ నిర్మించనుంది.
ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కనస్ట్రక్షన్ (ఈపీసీ) విధానంలో ఎంఈఐఎల్ ఈ అణు రియాక్టర్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. ఇప్పటి వరకు ఎన్పీసీఐఎల్ ఏకమొత్తంగా ఇచ్చిన అతిపెద్ద ఆర్డర్ ఇదే. బీహెచ్ఈఎల్, ఎల్ అండ్ టీ వంటి ఇతర ప్రముఖ బిడ్డర్లతో పోటీ పడి ఈ కాంట్రాక్టును ఎంఈఐఎల్ దక్కించుకోవడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక ఈపీసీ కాంట్రాక్ట్ ఎంఈఐఎల్కు లభించడం, భారతదేశ ఇంధన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కంపెనీ చేస్తున్న కృషిని తెలియజేస్తోంది. మొట్టమొదటిసారిగా ఈ టెండర్ ప్రక్రియలో క్వాలిటీ-కమ్-కాస్ట్-బెస్డ్ సెలెక్షన్ (క్యూసీబీఎస్) విధానాన్ని ఎన్పీసీఐఎల్ అవలంబించింది. టెండర్ కేటాయింపులో సాంకేతిక నైపుణ్యం, ఖర్చు సామర్థ్యం రెండింటినీ సమతుల్యంగా అంచనా వేసింది.
పర్చేజ్ ఆర్డర్ ను అందుకున్న సందర్భంగా ఎంఈఐఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) సుబ్బయ్య మాట్లాడుతూ తమ సంస్థ అత్యుత్తమ సాంకేతిక సామర్థ్యానికి, పోటీ తత్వానికి ఈ కాంట్రాక్టు సాధించటం ఓ నిదర్శనం అన్నారు. కైగా అణు రియాక్టర్ల నిర్మాణ ప్రాజెక్ట్ దేశ ఇంధన భవిష్యత్తుకు కీలకమైన అణు ఇంధన రంగంలోకి తమ సంస్థ వ్యూహాత్మక ప్రవేశాన్ని సూచిస్తుందని, ఎంఈఐఎల్కు ఇంజినీరింగ్ నైపుణ్యం, ఆవిష్కరణల పట్ల ఉన్న నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని అన్నారు. తాము అత్యున్నత ప్రమాణాలు, భద్రత, విశ్వసనీయతకు కట్టుబడి ఉంటూనే, ప్రాజెక్ట్‌ను నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశ, విదేశాలలో పెద్ద ఎత్తున ఈపీసీ ప్రాజెక్ట్‌లను విజయవంతంగా పూర్తి చేసిన బలమైన ట్రాక్ రికార్డ్త్, అణు శక్తి రంగంలో మన దేశ స్వావలంబనను పెంపొందించడంలో కీలక పాత్ర పోషించడానికి ఎంఈఐఎల్ సిద్ధంగా ఉందని సుబ్బయ్య తెలిపారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..