
బంగారంతో పాటు వెండి రేటు కూడా భారీగానే పెరిగిపోయింది. ఇప్పుడు వెండి వస్తువులు కొనాలన్నా కూడా ఆలోచించుకోవాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితుల్లో మీరు కొనే వెండి ఆభరణాలు కూడా కల్తీ చేయడానికి కొందరు వెనకాడరు. ముఖ్యంగా వెండి పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఆడవారు వేసుకునే వెండి పట్టీలు. మిగిలిన వెండి ఆభరణాల కన్నా పట్టీలు ఎక్కువగా అమ్ముడవుతుంటాయి. కొందరు వెండి పట్టీలను కూడా కల్తీ చేసి అమ్ముతుంటారు. మరి మీ దగ్గరున్న పట్టీల్లో ఉన్న వెండి స్వచ్ఛమైనదేనా లేక కల్తీ జరిగిందా అనే విషయం చిటికెలో ఇలా తెలుసుకోండి..
నొక్కి చూస్తే తెలుస్తుంది..
మీ వెండి పట్టీలను ఓసారి దంతాలతో కాస్త నొక్కి చూడండి. అది కాస్త వంగినట్టుగా అనిపిస్తే మీ దగ్గరున్న వెండిలో కల్తీ లేనట్టుగా అర్థం చేసుకోవాలి. అదే పట్టీలు ఎంతకీ వంగకుండా గట్టిగా తగులుతుంటే అది కల్తీ వెండిగా అనుమానించాలి.
అయాస్కాంతంతో టెస్టింగ్..
వెండి పట్టీలను కల్తీ చేసేందుకు చాలా మంది అందులో ఇనుము కలుపుతుంటారు. అలాంటప్పుడు కాసింత అయస్కాంతం ముక్కను తీసుకుని పట్టీలకు అంటించి చూస్తే మీకే తెలిసిపోతుంది. పట్టీలు దానికి అంటుకుని పోతుంటే అందులో కల్తీ జరిగిందని అర్థం.
పట్టీల రంగు పట్టించేస్తుంది..
మీ పట్టీలు స్వచ్చమైన వెండితో చేసినవే అని తెలుసుకోవాలి అంటే వాటిని ఒక రాయిపై పెట్టి రుద్దండి. ఆ రుద్దిన చోట ఎలాంటి రంగు మారిన ఆనవాళ్లు కనిపించవు. కల్తీ అయితే మాత్రం వెంటనే రంగు వదిలేస్తుంది.
ఈ గుర్తు చూసి కొనండి..
బంగారు ఆభరణాల స్వచ్ఛతను ఎలాగైతే 916 హాల్ మార్కుతో గుర్తిస్తామో అలాగే వెండికి కూడా ఓ కొలమానం ఉంది. వెండిని కొనేముందు 925 గుర్తు చూసి కొనాలి. వెండి ఆభరణాల కోసం 92.5 శాతం వెండిని ఉపయోగిస్తారు. అదే స్వచ్ఛమైన వెండి అయితే దానిపై 999 ముద్ర ఉంటుంది.
ఐస్ క్యూబ్ టెస్ట్..
మీ పట్టీలపై కాసింత ఐస్ ముక్కను తీసి ఉంచండి. మంచి వెండి అయితే అది వెంటనే కరిగిపోతుంది. అదే కల్తీ జరిగిన వెండిపై ఐస్ ఓ పట్టాన కరగదు. అందుకు కాస్త సమయం పడుతుంది. ఇలా మీ వెండి స్వచ్ఛతను గుర్తించండి.