
వేసవిలో శరీరాన్ని చల్లబరిచి, దాహాన్ని తీరుస్తూ శక్తినివ్వగల డ్రింక్స్ లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం. అందులో చెరుకురసం ప్రముఖంగా నిలుస్తుంది. ఇది తీపి రుచితో పాటు శరీరానికి శక్తిని అందిస్తుంది. అయితే మధుమేహం ఉన్నవారు దీనిని తాగకూడదా..? అనే సందేహం చాలా మందిలో ఉంది. ఇప్పుడు ఈ విషయం గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
చెరుకురసంలో సుమారు 15 శాతం సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి గ్లూకోజ్, ఫ్రుక్టోజ్ రూపంలో ఉంటాయి. ఈ చక్కెరలు శరీరంలో త్వరగా కణాలుగా మారి గ్లూకోజ్‌గా మారిపోతాయి. అంతే కాదు చెరుకురసంలో ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. ఫైబర్ లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని ఇది త్వరగా పెంచుతుంది. అందుకే చెరుకురసం విషయంలో మధుమేహం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
తీపి ఎక్కువగా ఉన్నా కూడా చెరుకురసంలో ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని పోషకాలు ఉన్నాయి. ఇందులో పాలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి సహజ సమ్మేళనాలు ఉండడం వల్ల శరీరంలో ఉండే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించడంలో ఇది ఉపయోగపడుతుంది. అలాగే దీని వల్ల జీర్ణ వ్యవస్థ బాగుపడుతుంది.
అధిక శారీరక శ్రమ చేసే వ్యక్తులు, ఉదాహరణకు వ్యవసాయ పనులు చేసే వారు లేదా వ్యాయామం ఎక్కువగా చేసే వారు, తక్కువ కొవ్వు ఆహారాన్ని తీసుకునేవారు చెరుకురసాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే వారి శరీరం ఆ తీపిని తక్షణ శక్తిగా ఉపయోగించుకోగలదు. అయితే వారు కూడా లిమిటెడ్ గా మాత్రమే తీసుకోవాలి.
మధుమేహం ఉన్నవారు చెరుకురసాన్ని తాగే ముందు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ను తక్షణంగా పెంచే ప్రమాదం ఉంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు, ఇన్సులిన్ తీసుకునే వారు లేదా మెడికేషన్ మీద ఉన్నవారు చెరుకురసం తాగడం వల్ల షుగర్ లెవల్స్ అదుపు తప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ సలహా లేకుండా చెరుకురసం తాగడం మంచిది కాదు.
ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తాము తినే, తాగే పదార్థాలపై అవగాహన కలిగి ఉండాలి. సహజంగా తీపిగా ఉండే చెరుకురసం తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నా.. మధుమేహం ఉన్నవారు మాత్రం వైద్య నిపుణుల సలహా తీసుకుని వారి సూచన మేరకు మాత్రమే దీనిని తీసుకోవాలి.
.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)