

భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ ప్రతిష్టాత్మకమైన భూభారతి చట్టం ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరినప్పుడే దానికి సార్ధకత ఏర్పడుతుందన్నారు. భూభారతి అవగాహన సదస్సులపై మంత్రి పొంగులేటి సమీక్షించారు. ఈ చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు, పకడ్బందీగా అమలు చేయాలన్న లక్ష్యంతో ఏప్రిల్ 17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేశామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అలాగే భూభారతి పైలట్ ప్రాజెక్ట్ అమలు చేసే నాలుగు మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు.
ఇందులో భాగంగా నారాయణ్‌పేట జిల్లా మద్దూర్ మండలంలోని కాజాపురం గ్రామంలో భూభారతి పైలట్ ప్రాజెక్ట్‌ను తానే స్వయంగా ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ఆతర్వాత వికారాబాద్ జిల్లా పూడూరు గ్రామంలో జరిగే అవగాహనా సదస్సులో పాల్గొంటానని చెప్పారు. ఏప్రిల్ 18వ తేదీన ములుగు జిల్లా వెంకటాపురంలో ఉదయం జరిగే రెవెన్యూ సదస్సులోనూ, తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో జరిగే సదస్సులో మంత్రి పొంగులేటి పాల్గొంటారు. రాష్ట్రంలోని నారాయణ్‌పేట్ జిల్లా మద్దూర్ మండలంతోపాటు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేట, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో ప్రయోగాత్మకంగా ఈచట్టాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి వెల్లడించారు.
ప్రయోగాత్మకంగా భూభారతిని అమలు చేసే ఈ నాలుగు మండలాల్లో భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి వాటికి రశీదులను అందజేస్తారు. ఇందుకోసం ఒక ప్రత్యేక ఫార్మేట్ లో తయారుచేసిన దరఖాస్తులను రెవెన్యూ సదస్సు ముందురోజే ప్రజలకు పంపిణీ చేస్తారు. ఎలాంటి భూసమస్యలు ఉన్నాయి, ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి, వాటిని ఏవిధంగా పరిష్కరించాలి, రానున్న రోజులలో చేపట్టాల్సిన చర్యలు, భూభారతి పోర్టల్‌పై ప్రజాస్పందనను చూసి భవిష్యత్తులో ఏవిధంగా ముందుకు వెళ్లాలనే విషయంపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.. కోర్టు పరిధిలో ఉన్న భూములు మినహా ప్రతి దరఖాస్తును మే 1వ తేదీ నుంచి పరిష్కరిస్తామని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఏరోజుకారోజు కంప్యూటర్ లో నమోదు చేసి ఆయా సంబంధిత అధికారులకు పంపించనున్నారు.
ఓ వైపు నాలుగు మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో భూభారతి చట్టంపై అవగాహనా సదస్సులు నిర్వహించనున్నారు. ఈ అవగాహన సదస్సులకు సంబంధించి కలెక్టర్లు ప్రతిరోజూ ప్రతి మండలంలో రెండు కార్యక్రమాలలో పాల్గొనేవిధంగా కార్యాచరణ రూపొందించుకునే విధంగా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. మండల కేంద్రాల్లో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్ రెవెన్యూ ఇనస్పెక్టర్ , సర్వేయర్ తదితర అధికారులతో బృందాలుగా ఏర్పడి సదస్సులు నిర్వహించనున్నారు. ఈ అవగాహనా సదస్సులు పూర్తైన తర్వాత ఆ నాలుగు మండలాలలో నిర్వహించిన మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ మినహా అన్ని మండలాల్లో నిర్వహించనున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..