

నారింజ తొక్కలో లిమోనెన్ అనే సహజసిద్ధమైన సమ్మేళనం ఉంటుంది. ఇది నారింజకు ప్రత్యేకమైన పుల్లని వాసనను అందిస్తుంది. అయితే ఈ వాసన బొద్దింకలకు అసహ్యం కలిగిస్తుంది. వంటగదిలో లేదా ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా కనిపించే చోట నారింజ తొక్కలను ఉంచితే అవి దానివైపు రాకుండా ఉంటాయి. ఇది చాలా తేలికైన సురక్షితమైన మార్గం కావడంతో దీన్ని చాలా మంది ఉపయోగిస్తారు.
నారింజ తొక్కను సరైన విధంగా ఉపయోగించాలి. ముందుగా నారింజ తొక్కను బాగా ఎండబెట్టాలి. దీనిని నేరుగా ఎండలో ఆరబెట్టవచ్చు లేదా మైక్రోవేవ్లో కొద్దిసేపు వేడి చేసి ఆరనివ్వాలి. పూర్తిగా ఆరిన తర్వాత బొద్దింకలు ఎక్కువగా కనిపించే ప్రాంతాల్లో ఈ తొక్కలను ఉంచాలి. నారింజ తొక్కల నుంచి వెలువడే లిమోనెన్ వాసన కారణంగా బొద్దింకలు దూరంగా వెళ్లిపోతాయి.
వంట చేసే స్టీల్ పాత్రలు కొన్నిసార్లు జిడ్డు పట్టి, ఎంత సబ్బుతో కడిగినా పూర్తిగా శుభ్రం కావు. కానీ నారింజ తొక్కలను ఉపయోగిస్తే అవి చాలా త్వరగా మెరిసిపోతాయి. నారింజ తొక్కలో సహజమైన ఆయిల్లు ఉండటంతో అవి పాత్రలపై పేరుకున్న మురికిని తొలగించడంలో సహాయపడతాయి.
మైక్రోవేవ్ వాడిన తర్వాత లోపల నూనె మరకలు, చెడు వాసన ఏర్పడతాయి. దీన్ని పరిష్కరించడానికి ఒక గిన్నెలో కొద్దిగా నీరు తీసుకుని అందులో నారింజ తొక్కను వేసి కొన్ని నిమిషాలు నాననివ్వాలి. ఆ తర్వాత ఈ నీటిని మైక్రోవేవ్లో ఉంచి వేడిచేయాలి. దీని వల్ల నీరు ఆవిరైపోతుంది. ఈ ఆవిరి వల్ల లోపల పేరుకున్న చెడు వాసన తొలగిపోతుంది.
బొద్దింకలు ఎక్కువగా తేమ ఉండే ప్రదేశాలలో కనిపిస్తాయి. కాబట్టి వంటగదిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కిచెన్ సింక్ దగ్గర తడి ఎక్కువగా ఉంటే బొద్దింకలు అక్కడ చేరుకుంటాయి. కాబట్టి ఆ ప్రదేశాన్ని ఎప్పుడూ పొడిగా ఉంచడం చాలా ముఖ్యం.
బొద్దింకలు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో నారింజ తొక్కలు ఉంచండి. ఇంట్లో తేమను తగ్గించేందుకు పొడి వాతావరణం కల్పించండి. రసాయన మందుల్ని మినహాయించి సహజ పద్ధతులు పాటించండి. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే ఇంట్లో బొద్దింకల సమస్య తగ్గిపోతుంది. అంతేకాకుండా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవచ్చు. కాబట్టి ఇకపై నారింజ తొక్కలను పారేయకుండా ఇలా ఉపయోగించండి.