

చండీగఢ్, మార్చి 2: హర్యానా రాష్ట్రంలో రోహతక్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వాల్ (22) దారుణ హత్యకు గురైంది. దుండగులు ఆమెను హత్య చేసి, అనంతరం సూట్ కేసులో మూటగట్టి ఓ నిర్మానుష ప్రాంతంలో పడేశారు. ఆమె మృతదేహం శనివారం (మార్చి 1) సూట్ కేసులో లభ్యమైంది. సప్లా బస్టాండ్ దగ్గర సూట్ కేసులో హిమానీ నార్వాల్ మృతదేహం ఉండటంతో స్థానికంగా కలకలం రేగింది. బస్టాండ్ వద్ద కిందపడి ఉన్న సూట్ కేసును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందం సంఘటన స్థలానికి చేరుకుని సూట్‌కేస్ తెరిచి చూడటంతో ఈ దారుణం వెలుగు చూసింది. గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రలో హిమానీ నార్వాల్ చురుగ్గా పాల్గొన్నారు.
హర్యాణా రాష్ట్రవ్యాప్తంగా 33 స్థానాలకు మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఈ సంఘటన జరిగింది. మార్చి 12న ఫలితాలు వెలువడనున్నాయి. రోహ్తక్ విజయ్ నగర్ ప్రాంతానికి చెందిన నర్వాల్ మెడపై చున్నీ చుట్టి ఉందని, చేతులపై మెహందీ ఉందని పోలీసులు తెలిపారు. ఆమెను చున్నీతో గొంతు బిగింయి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నార్వాల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పీజీఐఎంఎస్ రోహ్తక్కు తరలించారు. మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా కుమారుడు, కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ సింగ్ హుడా, పార్టీ ఎమ్మెల్యే బిబి బాత్రాతో కలిసి ఆమె దిగిన అనేక ఫోటోలను నర్వాల్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు.
నార్వాల్ హత్యపై కాంగ్రెస్ నేతలు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సిట్ దర్యాప్తును డిమాండ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామని సంప్లా పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ విజేంద్ర సింగ్ తెలిపారు. కేసు నమోదు చేసినట్లు కూడా ఆయన తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ హుడా స్పందిస్తూ.. ఇది అనాగరిక హత్య. దిగ్భ్రాంతికరమైనదని, ఈ ఘటన రాష్ట్ర శాంతిభద్రతలు ఎంతగా దిగజారాయో తెలియజేస్తుందని ఆయన ఎక్స్‌లో ట్వీట్ పెట్టారు. ఈ సంఘటనపై ఉన్నత స్థాయి నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని, ప్రభుత్వం బాధితురాలి కుటుంబానికి వీలైనంత త్వరగా న్యాయం చేయాలని, దోషులకు కఠినమైన శిక్ష విధించాలని ఆయన డిమాండ్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.