
ఒత్తైన జుట్టు అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. అందుకే జుట్టు మీద ప్రతీఒక్కరు ప్రత్యేక శ్రద్ధ పెడతారు. జుట్టు అందంగా ఉంచుకోవడం కోసం ఎంత దూరమైనా వెళతారు. జుట్టు ఎంత అందంగా ఉంటే ఆత్మవిశ్వాసం కూడా అంత రెట్టింపు ఉంటుంది. జుట్టు రాలిపోవడం, చిన్న వయసులోనే బట్టతల రావడం ఆత్మనూన్యతకు దారి తీస్తుంది. ఒత్తైన, పొడవైన, ఆరోగ్యకరమైన జుట్టు కోసం అంటూ అనేక కాస్మొటిక్ ఉత్పత్తులు మార్కెట్లోకి కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. జుట్టుకోసం ప్రత్యేక చికిత్సా పద్దతులు వచ్చాయి. జుట్టు పోషణకు ఎంతైనా ఖర్చుపెట్టడానికి వెనకాడకపోవడంతో అది పరిశ్రమకు దారి తీసింది.
జుట్టు రాలుతున్నదంటే యువకులే కాదు.. వృద్ధులు సైతం ఆందోళన చెందుతారు. రాలిపోయిన జుట్టును తిరిగి పెంచడానికి ఇంటి చిట్కాల నుంచి వైద్య చికిత్సలవరకు వివిధ మార్గాలను ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నాలే ఇటీవల పంజాబ్లో ఆందోళనకరమైన సంఘటనకు దారితీసింది. పంజాబ్లోని సంగ్రూర్లోని ఒక ఆలయంలో జరిగిన జుట్టు చికిత్స శిబిరానికి హాజరైన తర్వాత 67 మందికి కంటి ఇన్ఫెక్షన్లు సోకాయి. ఫలితంగా ఆస్పత్రిపాలు కావలసి వచ్చింది.
బట్టతలపై జుట్టును మొలిపిస్తామని వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అయితే అందుకు తాము అందించే నూనెను వాడాలని శరతు పెట్టారు. ఇంకేముందు ఆ నూనె కోసం స్థానికులు ఎగబడ్డారు. శిబిరంలో చేరి వారిచ్చిన నూనెను తలకు రాసుకున్న వెంటనే చికాకుతో కూడిన ఇన్ఫెక్షన్లకు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందడంతో చర్యలు తీసుకున్నారు. శిబిరాన్ని నిర్వహించిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతులు, నైపుణ్యం లేకుండా శిబిరం నిర్వహించారని విచారణలో పోలీసులు గుర్తించారు.
అనుమతులు లేని వైద్య శిబిరాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని స్థానికులు కోరారు. ఏదైనా చికిత్స లేదా మందులను తీసుకునే ముందు ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోవాలని ఆరోగ్య అధికారులు ప్రజలకు సూచించారు.