

రెండు రోజుల క్రితం బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ఒంగోలుకు చెందిన 28 ఏళ్ల సోమిశెట్టి వాసంతి అనుమానాస్పద స్థితిలో తన భర్త ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో మృతి చెందింది… ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం పొత్తూరు చెందిన సోమిశెట్టి వాసంతి, ఒంగోలు నగరం శ్రీనివాసనగర్‌కు చెందిన పగిడి రవి మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకన్నారు. వారిది ఒకే కులం కావడంతో పెద్దలు అంగీకరించి పెళ్లి చేశారు. వారికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. రవి, వాసంతి దంపతులు హైదరాబాద్ బీరంగూడాలో కాపురం పెట్టారు. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న రవి ఏడాది నుంచి ఉద్యోగానికి వెళ్లకుండా ఖాళీగా ఉంటున్నాడు. అప్పటి నుంచి వాసంతికి వేధింపులు మొదలయ్యాయి. అటు అత్తమామలు, ఇటు భర్త రవి నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని వాసతి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ విషయమై వాసంతి తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. అయితే అదేరోజు రాత్రి 12 గంటల తరువాత రవి వాసంతి తండ్రికి ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. తెల్లవారేసరికి ఆమె మృతదేహాన్ని తీసుకుని ఒంగోలులోని రవి ఇంటికి చేర్చారు.
వాసంతి తల్లిదండ్రులు అల్లుడు రవి ఇంటికి చేరుకునేలోపే అంత్యక్రియలు చేసేందుకు హడావిడి చేస్తుండటంతో అనుమానం వచ్చి వాసంతి శరీరాన్ని పరిశీలించారు. అయితే వాసంతి శరీరంపై గాయాలు ఉన్నట్లు గుర్తించిన ఆమె తల్లిదండ్రులు తాలుకా పోలీసులను ఆశ్రయించి తన కుమార్తెను హత్య చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గృహ హింస కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తాలుకా సీఐ అజయ్‌కుమార్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. హైదరాబాద్‌లో వాసంతి మృతిపై అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఒంగోలు తీసుకురావడంపై వాసంతి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్త, అత్తమామలే చంపి ఆత్మహత్య చేసుకున్నట్టు చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. స్వతహాగా ఎంతో ధైర్యవంతురాలైన వాసంతి ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి కాదని ఆమె తండ్రి సోమిశెట్టి శ్రీనివాసరావు చెబుతున్నారు. వాసంతిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.